
అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ సమ్మె – చర్చలు విఫలం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) కార్మిక సంఘాల జేఏసీ మరియు ప్రభుత్వం మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. సచివాలయంలో ఐఏఎస్ అధికారుల కమిటీతో నాలుగు గంటలకుపైగా సాగిన సమావేశం ఎటువంటి నిర్ణయానికి రాకపోవడంతో, జేఏసీ సమ్మెకు పిలుపునిచ్చింది.
జేఏసీ నేతలు వెల్లడించిన వివరాల ప్రకారం, ఈరోజు అర్ధరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు సమ్మె ప్రారంభించనున్నారు. సమ్మె కారణంగా బస్సులు డిపోలకే పరిమితం అయ్యే అవకాశముండగా, ప్రజా రవాణా సేవలు తీవ్రంగా ప్రభావితం కావచ్చు.
జేఏసీ నాయకులు ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సమ్మె నోటీసు ఇచ్చి 41 రోజులు గడిచిన తర్వాత మాత్రమే చర్చలకు పిలిచిందని, చర్చల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేసిందని ఆరోపించారు. తమ ప్రధాన డిమాండ్లైన ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, సంఘాల ఎన్నికలు నిర్వహించడం, బస్సులను పూర్తిగా ఆర్టీసీ ఆధ్వర్యంలోనే నడపడం వంటి అంశాలపై స్పష్టత ఇవ్వలేదని తెలిపారు.
ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ వెంకన్న మాట్లాడుతూ, “ప్రభుత్వం మా సమస్యలను పట్టించుకోలేదు. పరిష్కార మార్గాలు చూపాల్సిన అధికారులు స్పందించలేదు. మా సమ్మె వెనుక ఎవరూ లేరు, ఎవరి ఒత్తిళ్లకూ మేము తలొగ్గం” అని స్పష్టం చేశారు.
ఇక సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం కూడా కీలక నిర్ణయాలు తీసుకుంది. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రత్యామ్నాయంగా ప్రైవేట్ వాహనాలను వినియోగించడంతో పాటు, రాష్ట్రవ్యాప్తంగా డిపోలలో ప్రైవేట్ డ్రైవర్లతో బస్సులు నడపాలని నిర్ణయించింది.
సమ్మె కారణంగా రాబోయే రోజుల్లో ప్రజలు రవాణా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉండటంతో, ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
