చక్కెర ధరలపై కేంద్రం కీలక ప్రకటన.. ధరల పెరుగుదలకు కారణాలివే!
ఇథనాల్ కోసం చక్కెర మళ్లింపే కారణం కాదు.. 10 LMT ముడి చక్కెర డ్యూటీ ఫ్రీ దిగుమతికి నిర్ణయం

న్యూఢిల్లీ, ఆగస్టు 21: దేశంలో ఇటీవల పెరుగుతున్న చక్కెర ధరలపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. చక్కెర ధరలు జూలై 20న కిలో రూ.48.18 నుంచి ఆగస్టు 20 నాటికి రూ.55.70కు పెరిగినట్లు కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పండుగల సీజన్లో చక్కెర లభ్యత, ధరలను స్థిరంగా ఉంచేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపట్టినట్లు తెలిపింది.
ఇథనాల్ కారణం కాదన్న కేంద్రం
ఇటీవల చక్కెర ధరల పెరుగుదలకు ఇథనాల్ తయారీ కోసం చక్కెరను మళ్లించడమే కారణమని జరుగుతున్న ప్రచారాన్ని కేంద్రం ఖండించింది. వాస్తవానికి ఇథనాల్‌కు మళ్లించే చక్కెర వాటా 2022–23లో సుమారు 12 శాతం ఉండగా, 2025–26లో సుమారు 9 శాతానికి తగ్గిందని ప్రభుత్వం తెలిపింది.
దేశంలో ఉత్పత్తి అవుతున్న ఇథనాల్‌లో దాదాపు మూడు వంతులు ధాన్యాల నుంచి, ముఖ్యంగా మొక్కజొన్న నుంచి వస్తున్నట్లు కేంద్రం పేర్కొంది.
తగ్గిన చక్కెర ఉత్పత్తి
ప్రస్తుత సీజన్లో దేశీయ చక్కెర ఉత్పత్తి సుమారు 306 LMTగా ఉంటుందని అంచనా. తొలుత చెరకు పండించే రాష్ట్రాలు సుమారు 343 LMT ఉత్పత్తిని అంచనా వేశాయి. రెడ్ రాట్, టాప్ బోరర్ వంటి తెగుళ్లు, అధిక వర్షాల కారణంగా నీటిముంపు తదితర కారణాలతో చెరకు దిగుబడిపై ప్రభావం పడిందని ప్రభుత్వం తెలిపింది.
అయినప్పటికీ అక్టోబర్‌లో కొత్త క్రషింగ్ సీజన్ ప్రారంభమయ్యే వరకు దేశీయ డిమాండ్‌ను తీర్చేందుకు సరిపడా చక్కెర నిల్వలు ఉన్నాయని కేంద్రం స్పష్టం చేసింది.
పండుగల సీజన్.. పెరిగిన డిమాండ్
పండుగల సీజన్ నేపథ్యంలో చక్కెరకు డిమాండ్ పెరగడం, దేశీయ ఉత్పత్తి అంచనాల కంటే తక్కువగా ఉండటం, వాతావరణ పరిస్థితుల వల్ల చెరకు పంట దెబ్బతినడం, అంతర్జాతీయంగా చక్కెర సరఫరాలు తగ్గడం, కొందరు వ్యాపారుల నిల్వలు, స్పెక్యులేషన్ వంటి అంశాలు ధరల పెరుగుదలకు కారణమయ్యాయని కేంద్రం తెలిపింది.
ధరల నియంత్రణకు చర్యలు
ధరల పెరుగుదలను అరికట్టేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. ఆగస్టు 1 నుంచి నవంబర్ 30 వరకు దేశవ్యాప్తంగా చక్కెర డీలర్లకు 400 టన్నుల స్టాక్ పరిమితి విధించింది. సెప్టెంబర్ 1 నుంచి బల్క్ వినియోగదారులు తమ 15 రోజుల వినియోగానికి మించి చక్కెర నిల్వ చేయకుండా నిబంధనలు అమలు చేయనుంది.
చక్కెర మిల్లుల్లో నిల్వలను తనిఖీ చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కూడిన బృందాలు భౌతిక తనిఖీలు నిర్వహిస్తున్నాయి. నిల్వలు దాచిపెట్టి కృత్రిమ కొరత సృష్టించే ప్రయత్నాలను అడ్డుకోవడమే ఈ చర్యల లక్ష్యమని కేంద్రం తెలిపింది.
10 LMT ముడి చక్కెర డ్యూటీ ఫ్రీ దిగుమతి
దేశీయ మార్కెట్లో చక్కెర లభ్యతను మరింత పెంచేందుకు 10 LMT ముడి చక్కెరను డ్యూటీ ఫ్రీగా దిగుమతి చేసుకునేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే రాష్ట్రాలు, చక్కెర మిల్లులు అక్టోబర్ 15 నుంచి క్రషింగ్ ప్రారంభించాలని సూచించింది. దీని ద్వారా అక్టోబర్ నెలలో సాధారణంగా ఉత్పత్తయ్యే 3–4 LMT చక్కెరకు బదులుగా 10 LMTకు పైగా ఉత్పత్తి సాధించే అవకాశం ఉందని కేంద్రం అంచనా వేస్తోంది.
ప్రపంచ మార్కెట్లోనూ ధరల పెరుగుదల
చక్కెర ధరల పెరుగుదల భారత్‌కు మాత్రమే పరిమితం కాలేదని కేంద్రం తెలిపింది. 2026–27లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 33 LMT చక్కెర లోటు ఉండొచ్చని అంచనా వేసింది. అంతర్జాతీయ చక్కెర ధర కూడా జూన్ 30న టన్నుకు $474 నుంచి ఆగస్టు 20న $552కు పెరిగింది. అంటే రెండు నెలల్లో 16 శాతానికి పైగా పెరుగుదల నమోదైంది.
మొత్తంగా.. దేశంలో చక్కెర ధరలు పెరుగుతున్నప్పటికీ, తగినంత నిల్వలు ఉన్నాయని కేంద్రం చెబుతోంది. ధరలను అదుపులో ఉంచేందుకు నిల్వలపై నియంత్రణ, డ్యూటీ ఫ్రీ దిగుమతులు, ముందస్తు క్రషింగ్ వంటి చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేసింది.
