గ్రామాలకు కేంద్రం నిధులు ఇస్తోంది.. రాష్ట్రం పైసా ఇవ్వడం లేదు: బండి సంజయ్
నిధులను జీతాలకు మళ్లిస్తున్నారని ఆరోపణ

జగిత్యాల, జూలై 4(Zindagi9news): గ్రామ పంచాయతీలకు అందుతున్న నిధులన్నీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వమే ఇస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా కేటాయించడం లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలోని గంభీర్పూర్, పోసానిపేట, ధూంపేట్ గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రెయినేజీ పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు.
గ్రామాల అభివృద్ధికి వినియోగించాల్సిన కేంద్ర నిధులను పంచాయతీ సిబ్బంది జీతభత్యాలకు మళ్లించడం వల్ల అభివృద్ధి పనులు కుంటుపడుతున్నాయని విమర్శించారు. ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు, మరుగుదొడ్ల నిర్మాణం వంటి పథకాలన్నీ కేంద్ర ప్రభుత్వ నిధులతోనే అమలవుతున్నాయని పేర్కొన్నారు. గ్రామాల్లో తాగునీటి సమస్యతో పాటు ఇతర సమస్యలను గ్రామస్థులు తన దృష్టికి తీసుకువచ్చారని, వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తున్నప్పటికీ వాటిని అభివృద్ధి పనులకు ఎందుకు వినియోగించడం లేదో కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలు వాస్తవాలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని ఆయన పిలుపునిచ్చారు.
