- జీవన్ రెడ్డి చేరికతో బిఆర్ఎస్పై విమర్శలు
- కవిత నాయకత్వంలో కొత్త రాజకీయ పార్టీకి మద్దతు వెల్లువ
- మేడిగడ్డ ప్రాజెక్ట్‌పై సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన జాగృతి నేతలు

- కరీంనగర్, ఏప్రిల్ 21(zindagi9news):
తెలంగాణలో పాలకపక్షం మరియు ప్రధాన ప్రతిపక్షం ప్రజా సమస్యలను పక్కనపెట్టి బలప్రదర్శన రాజకీయాలకు దిగుతున్నాయని తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ విమర్శించారు. జీవన్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీలో చేరడం ద్వారా ఆ పార్టీకి తెలంగాణ ప్రజలతో ఉన్న అనుబంధం దెబ్బతిన్నదని ఆయన ఆరోపించారు.
రాజశేఖరరెడ్డి మెప్పు కోసం తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టిన వ్యక్తిని పార్టీలో చేర్చుకోవడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇప్పటివరకు గుర్తుకురాని మేడిగడ్డ ప్రాజెక్ట్ ఇప్పుడు ఎందుకు గుర్తుకు వచ్చిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇదే సందర్భంలో కరీంనగర్‌కు చెందిన తెలంగాణ ఉద్యమకారిణి కొమిరి పద్మ, మానకొండూర్ మండలానికి చెందిన కొలిపాక గౌతమి ఆధ్వర్యంలో పలువురు నాయకులు తెలంగాణ జాగృతిలో చేరారు. వారికి హరిప్రసాద్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 25న కవిత నాయకత్వంలో కొత్త రాజకీయ పార్టీ ప్రారంభం కానుందని, తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కారమే ఆ పార్టీ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఇప్పటికే పెద్ద సంఖ్యలో ప్రజలు ఆ పార్టీలో చేరేందుకు ముందుకు వస్తున్నారని చెప్పారు.
తెలంగాణలో ఉన్న ప్రధాన రాజకీయ పార్టీలు జాతీయ అంశాలకే ప్రాధాన్యత ఇస్తున్నాయని, రాష్ట్ర సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. బిఆర్ఎస్ జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టగా, కాంగ్రెస్ తెలంగాణ ప్రయోజనాలను విస్మరించిందని, బీజేపీ ఉత్తర భారత రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు.
మేడిగడ్డ ప్రాజెక్ట్ విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని, రైతులకు ప్రయోజనం కలిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే, జగిత్యాలలో బిఆర్ఎస్ నిర్వహించిన కార్యక్రమంపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు.
కవిత నాయకత్వంలో తెలంగాణ జాగృతి మరింత బలపడుతుందని, భవిష్యత్తులో ఆమె ముఖ్యమంత్రి అవడం ఖాయమని హరిప్రసాద్ విశ్వాసం వ్యక్తం చేశారు.
