షాబాద్ ఆరుగురు హత్యల కేసు: నిందితుడి ఆచూకీ చెబితే రూ.2 లక్షల బహుమతి

హైదరాబాద్, జూలై 11 (జిందగి9న్యూస్): రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో ఒకే రాత్రి ఆరుగురిని దారుణంగా హత్య చేసిన కేసులో ప్రధాన నిందితుడు పి. రాజ్‌కుమార్ కోసం ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ విస్తృతంగా గాలింపు చేపట్టింది. నిందితుడి ఫోటోను విడుదల చేసిన పోలీసులు, అతడి ఆచూకీ తెలిపి అరెస్టుకు దోహదపడే నమ్మకమైన సమాచారం అందించిన వారికి రూ.2 లక్షల నగదు బహుమతి ప్రకటించారు. సమాచారం ఇచ్చే వ్యక్తుల వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు.
నిందితుడి గురించి ఏ సమాచారం తెలిసినా 8712665324 నంబర్‌కు నేరుగా కాల్ చేయాలని లేదా వాట్సాప్ ద్వారా తెలియజేయాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, గతంలో తనపై నమోదైన పోక్సో కేసుపై కక్షతో రాజ్‌కుమార్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు గుర్తించారు. జూలై 10 అర్ధరాత్రి సమయంలో తనపై కేసు పెట్టిన మైనర్ బాలికతో పాటు ఆమె తల్లి, నాయనమ్మలను కత్తితో హత్య చేసిన అనంతరం, తన స్వగ్రామం దైవాలగూడకు వెళ్లి తన భార్యతో పాటు ఇద్దరు చిన్న కుమారులను కూడా దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
అనంతరం తన తండ్రికి ఫోన్ చేసి అందరినీ చంపేసినట్లు చెప్పి రాజ్‌కుమార్ పరారయ్యాడు. ఈ కేసును అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలు నిందితుడి కోసం గాలిస్తున్నాయి. నిందితుడికి సంబంధించిన ఏ చిన్న సమాచారం ఉన్నా వెంటనే పోలీసులకు అందించాలని తెలంగాణ పోలీసులు ప్రజలను కోరారు.
