రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం పథకానికి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానం

హైదరాబాద్, జూలై 11 (జిందగి9న్యూస్): తెలంగాణకు చెందిన సివిల్స్ అభ్యర్థులకు శుభవార్త. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) ఆధ్వర్యంలో అమలు చేస్తున్న ‘రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం’ పథకానికి ఈ ఏడాది కూడా ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఎస్సీసీఎల్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ డా. బుద్ధప్రకాశ్ జ్యోతి శనివారం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ పథకాన్ని కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ ఏడాది యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించి మెయిన్స్ పరీక్షకు ఎంపికైన తెలంగాణ అభ్యర్థులకు ఒక్కొక్కరికి రూ.1 లక్ష ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు వెల్లడించారు. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తులను పరిశీలించిన అనంతరం అర్హులైన ప్రతి అభ్యర్థికి రూ.1 లక్ష చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని తెలిపారు. పూర్తి మార్గదర్శకాలు, దరఖాస్తు విధానం కోసం scclmines.com వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.
తెలంగాణ యువత ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని సివిల్ సర్వీసెస్‌లో విజయాలు సాధించి రాష్ట్రానికి, దేశానికి సేవలు అందించాలని డా. బుద్ధప్రకాశ్ జ్యోతి ఆకాంక్షించారు.
రాష్ట్రంలో ఎక్కువ మంది యువత సివిల్ సర్వీసెస్‌లో విజయం సాధించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం సీఎస్ఆర్ కార్యక్రమంలో భాగంగా ఈ పథకాన్ని ఎస్సీసీఎల్ ద్వారా 2024లో ప్రారంభించింది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేతుల మీదుగా ఈ పథకం ప్రారంభమైంది.
2024 సివిల్స్ పరీక్షల్లో ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణులైన 140 మందికి రూ.1 లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందించగా, వారిలో 20 మంది ఇంటర్వ్యూకు ఎంపికై అదనంగా మరో రూ.1 లక్ష చొప్పున పొందారు. చివరకు ఏడుగురు సివిల్ సర్వీసెస్‌కు ఎంపికయ్యారు. గత ఏడాది 206 మంది అభ్యర్థులకు ఆర్థిక సహాయం అందించగా, వారిలో 50 మంది ఇంటర్వ్యూకు, 20 మంది తుది ఎంపిక సాధించారు. ఈ విధంగా గత రెండేళ్లలో మొత్తం 346 మంది సివిల్స్ అభ్యర్థులు ‘రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం’ పథకం ద్వారా ఆర్థిక సహాయం పొందినట్లు డా. బుద్ధప్రకాశ్ జ్యోతి తెలిపారు.
