షాబాద్ ఆరు హత్యల కేసు నిందితుడు రాజ్‌కుమార్ మృతి..

హైదరాబాద్, జూలై 13 (జిందగి9న్యూస్): రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షాబాద్ ఆరు హత్యల కేసు ప్రధాన నిందితుడు రాజ్‌కుమార్ సోమవారం మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. కొత్తూరు మండలం పంజర్ల గ్రామ శివారులో అతని మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసుల వివరాల ప్రకారం, రాజ్‌కుమార్ మృతదేహం పక్కనే విషం బాటిల్ లభ్యమవడంతో అతను పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి, అన్ని కోణాల్లో విచారణ చేపట్టినట్లు తెలిపారు.
రాజ్‌కుమార్‌పై షాబాద్‌లో ఒకే రాత్రి ఆరుగురిని హత్య చేసిన కేసు నమోదైంది. బాలికపై లైంగిక దాడి కేసులో అరెస్టై బెయిల్‌పై విడుదలైన అనంతరం కక్ష పెంచుకుని బాధిత బాలిక, ఆమె తల్లి, నానమ్మతో పాటు తన భార్య, ఇద్దరు పిల్లలను హత్య చేసినట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు.
ఈ ఘటన అనంతరం నిందితుడి కోసం ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పోలీసులు 14 ప్రత్యేక బృందాలతో రాష్ట్రవ్యాప్తంగా విస్తృత గాలింపు చేపట్టారు. అతడి ఆచూకీ తెలిపిన వారికి రూ.2 లక్షల నగదు బహుమతి కూడా ప్రకటించారు. పోలీసుల గాలింపు తీవ్రం కావడంతో తప్పించుకునే అవకాశం లేక తన మేనమామ గ్రామమైన పంజర్లకు చేరుకుని, అక్కడే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోస్టుమార్టం నివేదిక, ఫోరెన్సిక్ పరీక్షలు మరియు దర్యాప్తు అనంతరం వెల్లడికానున్నాయని పోలీసులు తెలిపారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
