రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి పనిచేయాలి.. ఎంపీలకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు

హైదరాబాద్, జూలై 13 (జిందగి9న్యూస్): తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల సాధనే లక్ష్యంగా పార్టీ రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల పార్లమెంట్ సభ్యులు సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ నెల 20 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం పెండింగ్‌లో ఉన్న రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై సోమవారం మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌లో ఎంపీలతో సమావేశమై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
రాష్ట్రానికి అత్యంత కీలకమైన నీటిపారుదల ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, హైదరాబాద్‌లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (IIM) ఏర్పాటు, హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్ (RRR), మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు, అంతర్రాష్ట్ర జల వివాదాలు, గోదావరి-కావేరి నదుల అనుసంధానం వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వ అనుమతులు, నిధులు సాధించేందుకు ఎంపీలు ప్రత్యేకంగా కృషి చేయాలని ముఖ్యమంత్రి కోరారు.
హైదరాబాద్‌లో ఐఐఎం ఏర్పాటుకు కేంద్ర ఆర్థిక శాఖ అనుమతి అవసరమని, ఇందుకోసం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసి విజ్ఞప్తి చేయాలని సూచించారు. అలాగే హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 విస్తరణ, ఫేజ్-1 స్వాధీనానికి సంబంధించిన ప్రక్రియ వేగవంతం చేయాలని, రీజినల్ రింగ్ రోడ్ ఉత్తర భాగంలో భూసేకరణ దాదాపు పూర్తయిందని, దక్షిణ భాగానికి కేంద్ర మంత్రిమండలి ఆమోదం అవసరమని తెలిపారు.
మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుకు అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద కేంద్రం నుంచి అనుమతి లేఖ సాధించాలని, తుంగభద్ర, గోదావరి జలాల వినియోగం, గోదావరి-కావేరి అనుసంధానం, ఏపీ నుంచి పెండింగ్‌లో ఉన్న నిరభ్యంతర పత్రాలు (ఎన్ఓసీలు), తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు వంటి అంశాల్లోనూ ఎంపీలు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సీఎం కోరారు.
శంషాబాద్ నుంచి బెంగళూరు, చెన్నై, ముంబైలకు ప్రతిపాదిత బుల్లెట్ రైలు ప్రాజెక్టు, ఆదిలాబాద్, వరంగల్ విమానాశ్రయాల అభివృద్ధి, ఎంఆర్వో (మెయింటెనెన్స్, రిపేర్స్ అండ్ ఓవర్‌హాలింగ్), ఎయిర్ కార్గో సదుపాయాల ఏర్పాటుకు కూడా కేంద్ర సహకారం తీసుకురావాలని సూచించారు.
రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కేంద్ర ప్రభుత్వంతో సహకార ధోరణితో ముందుకు సాగుతున్నామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఎంపీలకు అవసరమైన సమాచారాన్ని అందించేందుకు ఐఏఎస్ అధికారి అద్వైత్ కుమార్ సింగ్‌ను కో-ఆర్డినేషన్ అధికారిగా నియమించినట్లు తెలిపారు. అన్ని పార్టీల ఎంపీలను సమన్వయం చేసుకొని రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేయాలని ఎంపీల కన్వీనర్ డాక్టర్ మల్లు రవికి సూచించారు.
ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు జితేందర్ రెడ్డి, ఎంపీలు డాక్టర్ మల్లు రవి, ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కడియం కావ్య తదితరులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
