ఎల్-నినో సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధం.. రైతులు ఆందోళన చెందొద్దు: మంత్రి తుమ్మల

హైదరాబాద్, జూలై 13 (జిందగి9న్యూస్): వానాకాలం-2026లో ఎల్-నినో ప్రభావాలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల ముందస్తు చర్యలు చేపట్టిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రైతులు నష్టపోకుండా మూడు దశల కంటింజెన్సీ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసినట్లు వెల్లడించారు. సోమవారం హైదరాబాద్‌లోని ఇక్రిశాట్ (ICRISAT)లో భారత వాతావరణ శాఖ (IMD), ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, IIOR, IIMR, CRIDA శాస్త్రవేత్తలు, వ్యవసాయ అనుబంధ శాఖల ఉన్నతాధికారులతో మంత్రి సమగ్ర సమీక్ష నిర్వహించారు.
సమీక్షలో శాస్త్రవేత్తలు ఎల్-నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు కరువును తట్టుకునే పంటలు, ప్రత్యామ్నాయ సాగు విధానాలు, ఇప్పటికే సాగులో ఉన్న పంటల్లో తీసుకోవాల్సిన యాజమాన్య చర్యలపై నివేదిక సమర్పించారు. శాస్త్రవేత్తలు సూచించిన ప్రతి చర్యను క్షేత్రస్థాయిలో రైతులకు చేరవేసి, రైతులు తప్పనిసరిగా అమలు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు, వ్యవసాయ అధికారులు నిరంతరం గ్రామాల్లో పర్యటిస్తూ పరిస్థితులను పర్యవేక్షించాలని సూచించారు.
ఎల్-నినో ప్రభావంతో వర్షాలు ఆలస్యమయ్యే అవకాశం ఉన్నందున జూలై 15, జూలై 30, ఆగస్టు 15 తేదీలను ప్రాతిపదికగా తీసుకుని మూడు దశల కంటింజెన్సీ ప్రణాళిక రూపొందించినట్లు వ్యవసాయశాఖ డైరెక్టర్ తెలిపారు. పరిస్థితులకు అనుగుణంగా జిల్లా వారీగా ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసినట్లు వెల్లడించారు. వర్షాలు ఆలస్యమైతే అవసరమయ్యే విత్తనాలను ముందుగానే సమీకరించినట్లు తెలిపారు.
రాష్ట్రంలోని 33 జిల్లాల్లో వర్షపాత పరిస్థితులను ప్రభుత్వం రోజువారీగా సమీక్షిస్తోందని మంత్రి తెలిపారు. ప్రస్తుతం 13 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదుకాగా, 20 జిల్లాల్లో లోటు వర్షపాతం ఉందన్నారు. వర్షాభావ జిల్లాల్లో జిల్లా యంత్రాంగం, శాస్త్రవేత్తలు సమన్వయంతో వెంటనే అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.
ఎల్-నినో పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రతి వారం మండలాల వారీగా వ్యవసాయ-వాతావరణ బులెటిన్ విడుదల చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఇందులో వర్షపాతం, ఉష్ణోగ్రతలు, డ్రై స్పెల్స్, నేల తేమ, భూగర్భ జలాల లభ్యత, సాగునీటి పరిస్థితి, విద్యుత్ సరఫరా, పంటల స్థితి, రైతులు తీసుకోవాల్సిన యాజమాన్య చర్యల వివరాలు పొందుపరచాలని సూచించారు. ఈ బులెటిన్‌ను రైతు వేదికలు, గ్రామపంచాయతీలు, వాట్సాప్ గ్రూపులు, సోషల్ మీడియా, స్థానిక మీడియా ద్వారా రైతులకు చేరవేయాలని ఆదేశించారు.
శాస్త్రవేత్తల సూచనల మేరకు తగినంత నేల తేమ ఏర్పడిన తర్వాతే విత్తనాలు వేయాలని, బ్రాడ్ బెడ్ అండ్ ఫరో లేదా రిడ్జ్ అండ్ ఫరో పద్ధతులను అనుసరించాలని, నేల తేమను కాపాడే చర్యలు చేపట్టాలని మంత్రి తెలిపారు. వర్షాభావ పరిస్థితుల్లో పంటలకు ప్రాణాధార నీటిపారుదల, అంతర పంటలు, ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని సూచించారు.
వరి రైతులకు నారు నిర్వహణ, ఎరువుల వినియోగం, నీటి పొదుపు కోసం ఆల్టర్నేట్ వెట్టింగ్ అండ్ డ్రైయింగ్ (AWD) విధానాన్ని పాటించాలని, ఇంకా నారు వేయని రైతులు తక్కువ కాలంలో పండే రకాలతో ప్రత్యామ్నాయ సాగును పరిశీలించాలని మంత్రి సూచించారు. మొక్కజొన్న, పత్తి రైతులు నేల తేమ సంరక్షణకు అవసరమైన చర్యలు చేపట్టాలని తెలిపారు.
రాష్ట్రంలో విత్తనాలు, ఎరువుల కొరత ఉండదని మంత్రి స్పష్టం చేశారు. మూడు దశల కంటింజెన్సీ ప్రణాళికలకు అవసరమైన విత్తనాలను ముందుగానే సమీకరించామని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అలాగే ‘రైతు నేస్తం’ కార్యక్రమం ద్వారా ఎల్-నినో ప్రభావాలు, ప్రత్యామ్నాయ సాగు, నీటి యాజమాన్యం, నేల తేమ సంరక్షణ, శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులపై రైతులకు ప్రత్యేక అవగాహన కల్పిస్తామని తెలిపారు.
ఈ సమావేశంలో వ్యవసాయశాఖ కార్యదర్శి సురేంద్రమోహన్, ఇక్రిశాట్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ స్టాన్ఫోర్డ్ బ్లేడ్, వ్యవసాయశాఖ డైరెక్టర్ గోపి, ఉద్యానవన శాఖ డైరెక్టర్ యాస్మిన్ బాషా, వివిధ శాఖల అధికారులు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.
