ఇకపై ఎంపీడీఓ కార్యాలయంలోనే ‘ప్రజావాణి’.. తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు

మండల స్థాయికి ప్రజావాణి విస్తరణ.. ప్రతి సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహణ
ప్రతి సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో ప్రజావాణి నిర్వహణ
ప్రజావాణి పోర్టల్‌లోనే ఫిర్యాదుల నమోదు, ట్రాకింగ్
23 శాఖల అధికారులు హాజరై ప్రజల వినతులకు పరిష్కారం
ప్రజల వద్దకే ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను తీసుకొచ్చిన ప్రభుత్వం
హైదరాబాద్, ఆగస్టు 4 (Zindagi9news): ప్రజల సమస్యల పరిష్కారాన్ని మరింత వేగవంతం చేసి, ప్రజలకు చేరువ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని అధికారికంగా అమలు చేస్తూ ప్రణాళిక (వి) శాఖ జీఓ ఎంఎస్ నెం.4ను మంగళవారం విడుదల చేసింది.
ఉత్తర్వుల ప్రకారం, ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మండల పరిషత్ (ఎంపీడీవో) కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ఎంపీడీవో నోడల్ అధికారిగా వ్యవహరిస్తారు.
ప్రజావాణిలో తహసీల్దార్, ఎంపీఓ, వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్థక, మత్స్య, విద్య, వైద్య, ఐసీడీఎస్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ, హౌసింగ్, ఆర్ అండ్ బీ, ఇరిగేషన్, విద్యుత్, మున్సిపల్ తదితర శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరై ప్రజల ఫిర్యాదులను స్వీకరించి వెంటనే చర్యలు చేపట్టాల్సి ఉంటుంది.
ప్రజల నుంచి స్వీకరించే ప్రతి ఫిర్యాదును ప్రజావాణి పోర్టల్‌లో నమోదు చేసి, ఫిర్యాదు ఐడీతో కూడిన రసీదును అందజేస్తారు. అలాగే ప్రతి మండల ప్రజావాణి కేంద్రంలో కంప్యూటర్, స్కానర్, ఇంటర్నెట్ సౌకర్యాలతో ప్రత్యేక హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణులు, చిన్నారులతో వచ్చిన మహిళలకు ప్రజావాణిలో ప్రత్యేక ప్రాధాన్యం కల్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. మండల స్థాయిలో ప్రజల సమస్యలకు త్వరితగతిన పరిష్కారం అందించడం, సేవల పంపిణీలో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించడమే ఈ నిర్ణయం లక్ష్యమని ప్రభుత్వం వెల్లడించింది.
