మూడేళ్లలోనే 1,000 రోబోటిక్ శస్త్రచికిత్సలు పూర్తి చేసిన నిమ్స్
ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోబోటిక్ సర్జరీకి కొత్త మైలురాయి
90 శాతానికి పైగా ఉచితంగా ఆరోగ్యశ్రీ, సీఎంఆర్ఎఫ్ ద్వారా సేవలు
యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రో, సర్జికల్ ఆంకాలజీలో అత్యాధునిక శస్త్రచికిత్సలు

హైదరాబాద్, ఆగస్టు 3 (Zindagi9News): హైదరాబాద్‌లోని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) మరో చారిత్రాత్మక ఘట్టాన్ని నమోదు చేసింది. మూడేళ్లలోపు 1,000 రోబోటిక్ శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేసి ప్రభుత్వ వైద్యరంగంలో కొత్త మైలురాయిని నెలకొల్పింది. అత్యాధునిక రోబోటిక్ సాంకేతికతను ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తూ ప్రపంచ స్థాయి వైద్య సేవలను అందిస్తున్నట్లు నిమ్స్ వెల్లడించింది.
ఈ 1,000 శస్త్రచికిత్సల్లో యూరాలజీ విభాగం 590, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ 248, సర్జికల్ ఆంకాలజీ 162 శస్త్రచికిత్సలు నిర్వహించింది. ప్రోస్టేట్, మూత్రాశయ క్యాన్సర్, కిడ్నీ మార్పిడి, కాలేయం, ప్యాంక్రియాస్, పేగులు, అండాశయం, గర్భాశయ క్యాన్సర్ వంటి క్లిష్టమైన వ్యాధులకు అత్యంత ఖచ్చితత్వంతో రోబోటిక్ శస్త్రచికిత్సలు నిర్వహించినట్లు తెలిపింది.
ఈ విజయంలో అత్యంత విశేషమైన అంశం ఏమిటంటే, 90 శాతానికి పైగా రోబోటిక్ శస్త్రచికిత్సలను ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) వంటి ప్రభుత్వ పథకాల కింద పూర్తిగా ఉచితంగా నిర్వహించడం. దీంతో ఖరీదైన రోబోటిక్ వైద్య సేవలు సామాన్య ప్రజలకు కూడా అందుబాటులోకి వచ్చాయని నిమ్స్ పేర్కొంది.
నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాహుల్ దేవ్‌రాజ్ ఈ సందర్భంగా వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, ఆపరేషన్ థియేటర్ సిబ్బంది, ఇతర విభాగాల సేవలను అభినందించారు. ఈ ఘనతకు తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అందించిన సహకారం కీలకమని పేర్కొన్నారు. తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా రోబోటిక్ శస్త్రచికిత్సల రంగంలో నిమ్స్ ఆదర్శంగా నిలుస్తోందని ఆయన తెలిపారు.
