పోలీస్ ఉద్యోగ నియామకాలు పకడ్బందీగా నిర్వహించాలి: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్, ఆగస్టు 5: తెలంగాణలో పోలీస్ శాఖలో చేపట్టనున్న 7,437 ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నియామక ప్రక్రియలో ఎలాంటి అక్రమాలు, అవకతవకలకు తావులేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
పరీక్షల నిర్వహణకు సంబంధించి సమగ్ర కార్యాచరణ రూపొందించాలని, అభ్యర్థులకు శిక్షణ ఇస్తున్న కోచింగ్ సెంటర్ల కార్యకలాపాలపై నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఉద్యోగాల పేరుతో జరిగే సైబర్ మోసాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు.
నియామకాలపై తప్పుడు ప్రచారం చేసే దళారులు, నకిలీ వెబ్సైట్లు, సోషల్ మీడియా ద్వారా అభ్యర్థులను మోసం చేసే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. పోలీస్ ఉద్యోగాల నియామక ప్రక్రియను విశ్వసనీయంగా నిర్వహించి అర్హులైన అభ్యర్థులకు న్యాయం జరిగేలా చూడాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
