ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్ల సమస్యలు పరిష్కరించాలి.. హుజూరాబాద్‌లో ర్యాలీ

హుజూరాబాద్, జూలై 14 (జిందగి9న్యూస్): ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని స్వయంకృషి ప్లంబర్ యూనియన్, శుభజ్యోతి ఎలక్ట్రీషియన్ వర్కర్స్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం హుజూరాబాద్ పట్టణంలో ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు వేర్వేరుగా ర్యాలీలు నిర్వహించి తమ సమస్యలపై హుజూరాబాద్ తహసీల్దార్ జక్కని నరేందర్‌కు వినతిపత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా స్వయంకృషి ప్లంబర్ యూనియన్ అధ్యక్షుడు మోరే రవి, ప్రధాన కార్యదర్శి జున్నుతుల శ్రీనివాస్, శుభజ్యోతి ఎలక్ట్రీషియన్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సంగెం వెంకటస్వామి, కార్యదర్శి జున్నుతుల శ్రీనివాస్ మాట్లాడుతూ సమాజంలో మధ్యతరగతి జీవితం గడుపుతున్న ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్ కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
కార్మికులకు ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో ప్రాధాన్యత కల్పించాలని, సంఘ భవనాల నిర్మాణం కోసం ప్రభుత్వ స్థలంలో ఒక గుంట భూమిని కేటాయించాలని కోరారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలను దృష్టిలో ఉంచుకుని కూలీ రేట్లను పెంచామని, ఆ కొత్త రేట్లు అమలయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే లేబర్ కార్డుల చెల్లుబాటు వయోపరిమితిని ప్రస్తుతం ఉన్న 60 ఏళ్ల నుంచి 70 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ప్లంబర్, ఎలక్ట్రీషియన్ వర్కర్స్ అసోసియేషన్‌కు చెందిన పలువురు కార్మికులు పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
