హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్‌పై అక్రమాస్తుల కేసు.. ఏసీబీ దాడుల్లో రూ.9.24 కోట్ల ఆస్తుల గుర్తింపు

హైదరాబాద్, జూలై 14 (జిందగి9న్యూస్): హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (HMDA) చీఫ్ ఇంజినీర్ బి. రవీందర్‌పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసినట్లు తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) వెల్లడించింది. అవినీతి పద్ధతులు, అక్రమ మార్గాల ద్వారా భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు రావడంతో అవినీతి నిరోధక చట్టం-1988 కింద కేసు నమోదు చేశారు.
మంగళవారం ఏసీబీ అధికారులు ఆయన నివాసం, కార్యాలయం, బంధువులు, అనుచరులు, బినామీలకు చెందిన మొత్తం 10 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో కొండకల్, కిష్టాపూర్, పసమైలలో ఐదు ఓపెన్ ప్లాట్లు, నర్సింగి, నానక్‌రామ్‌గూడలో నాలుగు ఫ్లాట్లు, కొత్తూర్ మండలం గూడూరు, శంషాబాద్‌లో నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి, మొకిల గ్రామం శ్రీనివాస్ మెడోస్‌లో విల్లా, కొండాపూర్‌లో జీ+4 భవనం తదితర స్థిరాస్తులకు సంబంధించిన పత్రాలు లభించాయి. అధికారిక విలువ ప్రకారం వీటి విలువ రూ.5.88 కోట్లకు పైగా ఉండగా, మార్కెట్ విలువ మరింత ఎక్కువగా ఉంటుందని ఏసీబీ పేర్కొంది.
సోదాల్లో రూ.3.82 లక్షల నగదు, బ్యాంకు ఖాతాల్లో రూ.45.05 లక్షలు, సుమారు 1,440 గ్రాముల బంగారు ఆభరణాలు (సుమారు రూ.36.70 లక్షలు), 12.5 కిలోల వెండి వస్తువులు (సుమారు రూ.10 లక్షలు), రూ.17.24 లక్షల విలువైన గృహోపకరణాలు, రూ.9.32 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ పరికరాలు, నాలుగు వాహనాలు కూడా గుర్తించారు.
మొత్తం గుర్తించిన ఆస్తుల విలువ సుమారు రూ.9,24,02,276 (రూ.9.24 కోట్లు)గా ఏసీబీ అంచనా వేసింది. అదనపు ఆస్తులపై విచారణ కొనసాగుతోందని తెలిపింది.
నిందితుడిని హైదరాబాద్‌లోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నట్లు అధికారులు వెల్లడించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
