జేబులోనే పేలిన మొబైల్ ఫోన్.. తృటిలో తప్పిన పెను ప్రమాదం

నారాయణపేట, ఆగస్టు 19 (Zindagi9news): నారాయణపేట జిల్లా ఊట్కూరు మండలం బిజ్వార్ గ్రామంలో ఓ వ్యక్తి జేబులో ఉన్న మొబైల్ ఫోన్ ఒక్కసారిగా పేలిపోవడంతో కలకలం రేగింది. ఫోన్ నుంచి శబ్దం రావడాన్ని గమనించిన వ్యక్తి వెంటనే అప్రమత్తమై జేబులో నుంచి బయటకు తీస్తుండగానే ఫోన్ పేలిపోయింది. సమయస్ఫూర్తితో దానిని దూరంగా పడేయడంతో ఎలాంటి గాయాలు కాకుండా పెను ప్రమాదం తప్పింది.
సదరు వ్యక్తి ఫోన్‌ను రాత్రంతా ఛార్జింగ్‌లో ఉంచినట్లు సమాచారం. దీంతో బ్యాటరీ అధికంగా వేడెక్కడం వల్లే పేలుడు సంభవించి ఉండొచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. పేలిన ఫోన్‌కు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
మొబైల్‌ను ఛార్జింగ్‌లో పెట్టి ఎక్కువసేపు వదిలేయకుండా, కంపెనీ సూచించిన ఒరిజినల్ ఛార్జర్‌నే ఉపయోగించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఫోన్ అసాధారణంగా వేడెక్కితే వెంటనే ఛార్జింగ్ నిలిపివేసి, దానిని సురక్షిత ప్రదేశంలో ఉంచాలని చెబుతున్నారు.
