- రూ. 2.50 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ప్రైవేట్ వ్యక్తి
- నిషేధిత జాబితా నుండి భూమి తొలగింపునకు రూ. 5 లక్షల డిమాండ్

హైదరాబాద్ / మేడ్చల్: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కీసర తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. భూమిని నిషేధిత జాబితా నుండి తొలగించేందుకు భారీగా లంచం డిమాండ్ చేసిన డిప్యూటీ తహసీల్దార్, వీఆర్వోతో పాటు ఓ ప్రైవేట్ వ్యక్తిని రంగారెడ్డి రేంజ్ ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ వ్యక్తి తన తల్లి, కుటుంబ సభ్యుల పేరిట ఉన్న వ్యవసాయ భూములను రిజిస్ట్రేషన్ యాక్ట్ 22-A (నిషేధిత జాబితా) నుండి తొలగించాలని కోరుతూ కీసర తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. ఈ పని పూర్తి చేసేందుకు డిప్యూటీ తహసీల్దార్ ఆమనగంటి సందీప్ కుమార్ రెడ్డి (AO-1) రూ. 5 లక్షలు లంచం డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా రూ. 2.50 లక్షలను వీఆర్వో నన్నూరి విజయ్ కుమార్ రెడ్డి (AO-3) సూచనల మేరకు ప్రైవేట్ వ్యక్తి కావలి బాలకృష్ణ (A-2) ద్వారా గురువారం స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు వల పన్ని పట్టుకున్నారు.నిందితుడు బాలకృష్ణ వద్ద నుంచి రూ. 2.50 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. తమ విధులను అక్రమంగా, నిజాయితీ లేకుండా నిర్వహించినందుకు గాను డిప్యూటీ తహసీల్దార్ సందీప్ కుమార్ రెడ్డి, వీఆర్వో విజయ్ కుమార్ రెడ్డిలతో పాటు ప్రైవేట్ వ్యక్తి బాలకృష్ణను అరెస్ట్ చేసి నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం అడిగితే టోల్ ఫ్రీ నంబర్ 1064కు లేదా వాట్సాప్ నంబర్ 9440446106కు సమాచారం ఇవ్వాలని ఏసీబీ విజ్ఞప్తి చేశారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
