
ఫ్లైఓవర్‌పై ఫ్లెక్సీలు… ప్రమాదాలకు ఆహ్వానం!
జమ్మికుంట ఫ్లైఓవర్‌పై పొంచి ఉన్న ప్రమాద భయం.. అధికారుల నిర్లక్ష్యంపై సర్వత్రా విమర్శలు

జమ్మికుంట, మార్చి 29 (Zindagi9News):
జమ్మికుంట ఫ్లైఓవర్ ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ బోర్డులకు అడ్డాగా మారింది.ఇప్పటికే ఈ వంతెనపై అనేక ప్రమాదాలు జరిగి ఎంతోమంది వాహనదారులు గాయపడటం, ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఇటువంటి సున్నితమైన ప్రదేశంలో భద్రతా చర్యలు చేపట్టాల్సిన అధికారులు, అవేమీ పట్టించుకోకుండా వంతెన పొడవునా భారీ ఫ్లెక్సీలు వెలుస్తున్నా మౌనంగా ఉండటం విస్మయానికి గురిచేస్తోంది.

నిబంధనలు గాలికి.. రేలింగ్ అంతా ఫ్లెక్సీలే!
వంతెన భద్రత కోసం ఏర్పాటు చేసిన రేలింగ్‌ను ఆనుకుని ప్రస్తుతం వందలాది ఫ్లెక్సీలు వెలిశాయి. పండుగ శుభాకాంక్షలు, రాజకీయ నాయకుల ప్రచార హోర్డింగ్‌లతో వంతెన రేలింగ్ అస్సలు కనిపించకుండా పోయింది. ఈ ఫ్లెక్సీలు గాలికి ఊగిపోతూ వాహనదారుల ఏకాగ్రతను దెబ్బతీస్తున్నాయి. ఇప్పటికే వంతెనపై ఉన్న మలుపుల వల్ల ప్రమాదాలు జరుగుతుంటే, ఇప్పుడు ఈ ఫ్లెక్సీల వల్ల ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక ‘బ్లైండ్ స్పాట్స్’ ఏర్పడుతున్నాయి.

గత ప్రమాదాల నుండి పాఠాలు ఏవి?
ఈ ఫ్లైఓవర్‌పై గతంలో ఎన్నో ఘోర ప్రమాదాలు జరిగాయి. ఆ చేదు జ్ఞాపకాలు ఇంకా ప్రజల కళ్లముందే ఉన్నాయి. వంతెనపై ప్రయాణమంటేనే వాహనదారులు భయపడే పరిస్థితి ఉంది. ఇలాంటి సమయంలో మరింత అప్రమత్తంగా ఉండి, వంతెనపై ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాల్సిన మున్సిపల్ అధికారులు, ఫ్లెక్సీల ఏర్పాటును ఏమాత్రం అడ్డుకోకపోవడం వారి బాధ్యతారాహిత్యానికి నిదర్శనం.

మృత్యుపాశాలుగా మారకముందే మేల్కొనండి!
బలమైన గాలులు వీచినప్పుడు ఈ ఫ్లెక్సీలు ఊడిపోయి ద్విచక్ర వాహనదారుల మీద పడితే జరిగే ప్రాణనష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారు? అని పట్టణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే అనేక ప్రాణాలు బలితీసుకున్న ఈ ఫ్లైఓవర్‌పై అధికారులు వెంటనే స్పందించాలి. అక్రమంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను యుద్ధ ప్రాతిపదికన తొలగించి, వాహనదారుల భద్రతను కాపాడాలని Zindagi9News డిమాండ్ చేస్తోంది.
