
‘సార్.. నాకు అమ్మానాన్న లేరు, మీరే దేవుడు’: పరీక్షా పత్రంలో ఇంటర్ విద్యార్థి కంటతడి పెట్టించే లేఖ!
హైదరాబాద్: “గురువే దైవం.. గురువే ధైర్యం.. కష్టపడే వాడికి గురువు ఎప్పుడూ మేలు చేస్తాడు..” ఇవి ఏదో పుస్తకంలోని నీతి వాక్యాలు కావు. పరీక్ష సరిగ్గా రాయలేక, ఫెయిల్ అవుతాననే భయంతో ఓ విద్యార్థి తన ఆన్సర్ షీట్లో రాసుకున్న ఆవేదన. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక ఇంటర్మీడియట్ విద్యార్థి లేఖ నెటిజన్ల మనసు కలచివేస్తోంది.
బోర్డర్ మార్కులతోనైనా పాస్ చేయండి..
ఆ విద్యార్థి తన లేఖలో అత్యంత దీనంగా తన పరిస్థితిని వివరించాడు. “సార్.. నన్ను పాస్ చేయండి. మీరు నన్ను పాస్ చేస్తే నాకు పెద్ద వరం ఇచ్చిన వారవుతారు. కనీసం బోర్డర్ మార్కులతోనైనా గట్టెక్కించండి సార్.. మీ కాళ్లు పట్టుకుంటా” అంటూ ప్రాధేయపడ్డాడు. చదివినవి ఏవీ పరీక్షలో రాలేదని, అందుకే ఏమీ రాయలేకపోతున్నానని తన నిస్సహాయతను వ్యక్తం చేశాడు.
గురువునే తల్లిదండ్రులుగా భావిస్తూ..
అనాధ అయిన ఆ విద్యార్థి రాసిన మాటలు ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తున్నాయి. “సార్.. నాకు అమ్మ నాన్న లేరు. మీరే నాకు అమ్మ, నాన్న. దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాను.. ఆ దేవుడు మీరే సార్. దేవుడు ఎప్పుడూ మంచి వారికే సహాయం చేస్తాడు” అంటూ తనను పాస్ చేయాలని ఆ ఉపాధ్యాయుడిని దేవుడిలా వేడుకున్నాడు.
వైరల్గా మారిన డ్రాయింగ్:
కేవలం అక్షరాలతోనే కాకుండా, ఒక విద్యార్థి తన గురువు పాదాలకు నమస్కరిస్తున్నట్లుగా పెన్నుతో గీసిన బొమ్మ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ లేఖ నిజంగా ఏ విద్యార్థి రాశాడు? ఏ జిల్లాలో ఇది వెలుగు చూసింది? అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నప్పటికీ, విద్యార్థులు ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడికి మరియు వారి సామాజిక పరిస్థితులకు ఈ లేఖ ఒక అద్దం పడుతోంది.
ఈ ఫోటో చూసిన నెటిజన్లు.. “చదువు ఒక్కటే జీవితం కాదు, ఇలాంటి పిల్లలకు భరోసా ఇచ్చే వ్యవస్థ కావాలి” అని అభిప్రాయపడుతున్నారు.
