కవిత సమక్షంలో తెలంగాణ రక్షణ సేనలో భారీ చేరికలు

హైదరాబాద్, మే 31(Zindagi9news): తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సమక్షంలో పలువురు విద్యార్థి, యువజన, మహిళా నాయకులు తెలంగాణ రక్షణ సేనలో చేరారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కరీంనగర్ జిల్లా బాధ్యులు గుంజపడుగు హరిప్రసాద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
శాతవాహన యూనివర్సిటీ జేఏసీ అధ్యక్షుడు, టీఆర్ఎస్ విద్యార్థి విభాగం జిల్లా నాయకుడు చెన్నమల్ల చైతన్య, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు గుగులోతు దివ్య, చింతకుంట మాజీ వార్డు సభ్యుడు గుర్రం సత్యం గౌడ్, బీఆర్ఎస్ యువజన విభాగం జిల్లా నాయకుడు లింగంపల్లి శ్రీనివాస్‌తో పాటు పలువురు విద్యార్థి, యువజన, మహిళా నాయకులు పార్టీ సభ్యత్వం స్వీకరించారు. ఈ సందర్భంగా కవిత వారికి పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలికారు.
అనంతరం కవిత మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతు డిస్కం ఏర్పాటు పేరుతో మిగతా రెండు డిస్కంలను ప్రైవేటీకరించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఉచిత విద్యుత్‌ను తొలగించి వ్యవసాయ మోటార్లకు మీటర్లు ఏర్పాటు చేయాలనే యత్నం జరుగుతోందని విమర్శించారు. రైతులకు నష్టం చేసే రైతు డిస్కంకు విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఇవ్వవద్దని ప్రజలు కోరుతున్నారని తెలిపారు.
ఒకవేళ అనుమతి ఇచ్చినా సుప్రీంకోర్టు వరకు వెళ్లి అయినా దానిని అడ్డుకుంటామని కవిత హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సంస్కరణల పేరుతో అమలు చేస్తున్న విధానాలకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు పలుకుతోందని విమర్శించారు.
తెలంగాణ రక్షణ సేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉచిత విద్య, ఉచిత వైద్యాన్ని కచ్చితంగా అమలు చేస్తామని కవిత పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు లాకావత్ రూప్ సింగ్, లింగంపల్లి నాగరాజు, మల్లారెడ్డి, బుడిగె పరశురాం గౌడ్, శ్రీనివాస్ గౌడ్, బండ అశోక్, కొండపాక రాకేష్ రెడ్డి, సబ్బు నాగరాజు, నాగునూరి రమేష్ చారి, పూజా తదితరులు పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
