కరీంనగర్లో హిందూ ఏక్తా యాత్రలో బండి సంజయ్ భావోద్వేగ ప్రసంగం
“నా కొడుకును నేను సమర్థించడం లేదు.. చట్టాన్ని గౌరవిస్తా” – కేంద్ర మంత్రి బండి సంజయ్

కరీంనగర్: బండి సంజయ్ కుమార్ మంగళవారం కరీంనగర్లో నిర్వహించిన హిందూ ఏక్తా యాత్రను ఉద్దేశించి భావోద్వేగ ప్రసంగం చేశారు. గత కొన్ని రోజులుగా తన కుటుంబంపై వస్తున్న ఆరోపణలు, రాజకీయ పరిణామాల నేపథ్యంలో కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
“నేను కంటతడి పెట్టను.. బాధలను చూసి భయపడి పారిపోయే వ్యక్తిని కాను” అంటూ తన రాజకీయ ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. “చిన్న కార్యకర్తగా ప్రారంభమైన నా ప్రస్థానం కష్టాలు, బాధల మధ్య సాగింది. కరీంనగర్ గడ్డ రక్తం నాలో ప్రవహిస్తోంది. గల్లీ గల్లీలో ప్రజా సమస్యలపై పోరాడాను” అని పేర్కొన్నారు.
హిందూ ఐక్యత కోసమే గత 16 ఏళ్లుగా హిందూ ఏక్తా యాత్ర నిర్వహిస్తున్నానని చెప్పారు. “జై శ్రీరాం అనే నినాదమే హిందూ ధర్మాన్ని కాపాడుతుంది. హిందూ సమాజానికి ఆపద వస్తే జై శ్రీరాం నినాదంతో తెగించి పోరాడతాం” అని అన్నారు. కరీంనగర్ ప్రజలకు హ్యాట్సాఫ్ చెబుతూ, టవర్ సర్కిల్‌పై కాషాయ జెండా ఎగరవేశామని గుర్తుచేశారు.
తన ఆరోగ్య పరిస్థితిని ప్రస్తావిస్తూ, “హార్ట్‌లో స్టంట్ ఉన్నా హార్ట్ ఫుల్‌గా 1600 కిలోమీటర్లు నడిచాను. తెలంగాణ ప్రజల కష్టాలను పంచుకున్నాను” అన్నారు. గతంలో తనపై రాళ్ల దాడులు జరిగినా, 109 కేసులు పెట్టి జైలుకు పంపినా భయపడలేదని తెలిపారు.
ఇటీవలి వివాదాలపై స్పందించిన ఆయన, “నా కొడుకు తప్పు చేయలేదని చెబుతున్నాడు. అయినా నేను నా కొడుకును సమర్థించడం లేదు. చట్టాన్ని, న్యాయాన్ని గౌరవిస్తాం. కోర్టు ఏ నిర్ణయం తీసుకున్నా శిరసావహిస్తాం. చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చు” అని స్పష్టం చేశారు.
“నా టైమంతా సమాజానికే ఇచ్చాను. నా కొడుకుకు సమయం ఇవ్వలేకపోయాను. అది నా తప్పే.. నన్ను క్షమించండి” అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. “నా కుటుంబానికి నిప్పంటించారు.. ఆ నిప్పుతో అవినీతి వ్యవస్థను దగ్ధం చేస్తా. నన్ను, నా కుటుంబాన్ని, కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదు” అని హెచ్చరించారు.
చివరగా, “నా చివరి శ్వాస వరకు హిందూ ధర్మం కోసమే పనిచేస్తా. బండి సంజయ్ భయపడే ప్రసక్తే లేదు” అంటూ తన ప్రసంగాన్ని ముగించారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
