అల్ఫోర్స్ జూనియర్ కళాశాలలో నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ

కరీంనగర్, జూలై 13 (జిందగి9న్యూస్): జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమంలో భాగంగా స్థానిక కొత్తపల్లిలోని అల్ఫోర్స్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో సోమవారం నులిపురుగుల నివారణ (ఆల్బండజోల్) మాత్రల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి. నరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు మాత్రలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ వి. నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలని, ఆరోగ్యం బాగుంటేనే విద్యతో పాటు అన్ని కార్యకలాపాల్లో ఉత్సాహంగా పాల్గొనగలరని అన్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ పలు ఆరోగ్య కార్యక్రమాలను అమలు చేస్తున్నాయని తెలిపారు.
నులిపురుగుల నివారణ కోసం ప్రతి చిన్నారి తప్పనిసరిగా ఆల్బండజోల్ మాత్రలు తీసుకోవాలని, సంవత్సరానికి రెండుసార్లు ఈ మాత్రలు తీసుకోవడం వల్ల శరీరంలోని నులిపురుగులు తొలగిపోవడంతో పాటు ఆరోగ్యం మెరుగుపడుతుందని పేర్కొన్నారు. నులిపురుగుల సమస్యను నిర్లక్ష్యం చేస్తే ఎదుగుదల మందగించడం, బరువు తగ్గడం, పోషకాహార లోపం, చదువుపై ఏకాగ్రత తగ్గడం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని వివరించారు.
భారత ప్రభుత్వం సూచనల మేరకు 1 నుంచి 19 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు ఈ మాత్రలు అందిస్తున్నట్లు తెలిపారు. పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
