గుప్త నిధుల పేరుతో ఘరానా మోసం.. రూ.1 కోటి స్వాహా
హైదరాబాద్‌లో నలుగురు సభ్యుల ముఠా అరెస్ట్.. 11 మందిని మోసం చేసినట్లు పోలీసుల గుర్తింపు

హైదరాబాద్, ఆగస్టు 11 (జిందగి9న్యూస్): ఇళ్ల కింద గుప్త నిధులు ఉన్నాయని నమ్మించి ప్రజలను మోసం చేస్తూ సుమారు రూ.1 కోటి వరకు స్వాహా చేసిన నలుగురు సభ్యుల ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు గుంతల్లో బొగ్గు, నకిలీ బంగారు నాణేలను పాతిపెట్టి బాధితులను నమ్మించేవారని పోలీసులు తెలిపారు.
నిందితులు ముందుగా ఇళ్ల కింద గుప్త నిధులు ఉన్నాయని బాధితులను నమ్మించేవారు. అనంతరం గుంతల్లో బొగ్గు, నకిలీ బంగారు నాణేలను పాతిపెట్టి వాటిని బయటకు తీసేవారు. తాము చెప్పిన పూజలు, ప్రత్యేక క్రతువులు నిర్వహిస్తే బొగ్గు కాస్తా బంగారంగా మారుతుందని నమ్మించి బాధితుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసేవారని పోలీసులు వెల్లడించారు.
ఇలా మొత్తం 11 మందిని మోసం చేసి దాదాపు రూ.1 కోటి వరకు వసూలు చేసినట్లు దర్యాప్తులో గుర్తించారు.
నిందితులు వీరే..
1. మహ్మద్ మునవ్వర్ (36)
2. సయ్యద్ అలీ అష్రఫ్ (40)
3. మహ్మద్ హాజీ (25)
4. మహ్మద్ సల్మాన్ (29)
ఈ నలుగురిలో ప్రధాన నిందితుడైన మహ్మద్ మునవ్వర్ గతంలో కారు మెకానిక్, పెయింటర్‌గా పనిచేసేవాడని పోలీసులు తెలిపారు. తక్కువ ఆదాయంతో జీవనం సాగించడం కష్టంగా మారడంతో స్నేహితులతో కలిసి గుప్త నిధుల పేరుతో ప్రజలను మోసం చేసి డబ్బులు సంపాదించేందుకు పథకం రూపొందించినట్లు వెల్లడించారు.
ముఠా కార్యకలాపాలపై సమాచారం అందుకున్న పోలీసులు పక్కా ప్రణాళికతో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రెండు కార్లు, నాలుగు మొబైల్ ఫోన్లు, ఒక ఆటో, రెండు బైక్‌లు, 25 నకిలీ బంగారు నాణేలు, పూజా సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
గుప్త నిధులు, పూజలు, బంగారంగా మారే వస్తువుల పేరుతో ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ఇలాంటి మోసాలకు గురికాకుండా అనుమానాస్పద వ్యక్తుల సమాచారం వెంటనే పోలీసులకు అందించాలని కోరారు.
