చేయూత కొత్త పింఛన్లకు దరఖాస్తుల స్వీకరణ.. ఆగస్టు 31 వరకు అవకాశం
అర్హత ప్రమాణాల్లో మార్పులేదు.. గతంలో ఉన్న మార్గదర్శకాల ప్రకారమే కొత్త పింఛన్ల మంజూరు

హైదరాబాద్, ఆగస్టు 11 (జిందగి9న్యూస్): తెలంగాణ ప్రభుత్వం చేయూత సామాజిక భద్రత పింఛన్ పథకం కింద కొత్త పింఛన్ల మంజూరుకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించింది. కొత్త పింఛన్ల కోసం ఆగస్టు 31, 2026 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అర్హులైన పేదలు, బలహీన వర్గాలకు సామాజిక భద్రత కల్పించడమే లక్ష్యంగా ఈ ప్రక్రియ చేపట్టినట్లు ప్రభుత్వం తెలిపింది.
తొలిదశలో ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, ఫైలేరియా బాధితులు, తలసేమియా, సికిల్ సెల్ వ్యాధి, హీమోఫీలియా వంటి రక్త సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారికి కొత్త పింఛన్లు మంజూరు చేయనున్నారు.
అర్హత నిబంధనల్లో మార్పులేదు
కొత్త పింఛన్లకు సంబంధించి అర్హత ప్రమాణాల్లో ఎలాంటి మార్పు చేయలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. 2014 నుంచి 2018 మధ్య జారీ చేసిన సంబంధిత ప్రభుత్వ ఉత్తర్వుల్లోని అర్హత నిబంధనల ప్రకారమే కొత్త దరఖాస్తులను పరిశీలించనున్నారు.
ప్రజాపాలన వారోత్సవాలు, 99 రోజుల ప్రగతి ప్రణాళిక గ్రామసభలు, ప్రజావాణిలో ఇప్పటికే అందిన దరఖాస్తులను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. గతంలో దరఖాస్తు చేసి అవసరమైన అన్ని పత్రాలు సమర్పించిన వారు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. అవసరమైన పత్రాలు సమర్పించని వారు లేదా ఇప్పటివరకు దరఖాస్తు చేయని అర్హులు కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చు.
ధ్రువపత్రాలు తప్పనిసరి
వితంతువులకు భర్త మరణ ధ్రువపత్రం, ఒంటరి మహిళలకు సెపరేషన్ లేదా స్థానిక విచారణ నివేదిక, గీత కార్మికులకు ఎక్సైజ్ శాఖ ధ్రువీకరణ, చేనేత కార్మికులకు చేనేత–జౌళి శాఖ ధ్రువీకరణ, ఫైలేరియా బాధితులకు వైద్య ఆరోగ్య శాఖ ధ్రువీకరణ వంటి అవసరమైన పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.
దరఖాస్తుల పరిశీలన అనంతరం సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో అర్హతను తనిఖీ చేస్తారు. అనంతరం అర్హుల జాబితాను జిల్లా స్థాయికి పంపి, జిల్లా కలెక్టర్ ఆమోదంతో పింఛన్ మంజూరు ప్రక్రియ పూర్తి చేయనున్నారు.
ప్రతి అర్హుడికి చేయూత అందేలా స్వయం సహాయక సంఘాల సమాఖ్యలకు కూడా బాధ్యతలు అప్పగించారు. ముఖ్యంగా అర్హత కలిగిన వితంతువులు, ఒంటరి మహిళలకు దరఖాస్తు చేసుకోవడం, అవసరమైన ధ్రువపత్రాలు పొందడంలో సహకరించాలని సూచించారు.
ఆగస్టు 31 వరకు దరఖాస్తుల స్వీకరణతో పాటు వివరాలను చేయూత పోర్టల్లో నమోదు చేసే ప్రక్రియను కూడా చేపట్టనున్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకం అందేలా పారదర్శకంగా, నిబంధనల ప్రకారం ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.
