మనవళ్లు భూమి కాజేశారని ఆర్డీఓకు వృద్ధ దంపతుల ఫిర్యాదు
పోషణ కల్పించకుండా ఆస్తి లాక్కున్నారని ఆవేదన

హుజూరాబాద్, జూలై 6 (Zindagi9news): వృద్ధాప్యంలో ఉన్న తమను కొడుకు, మనవళ్లు పట్టించుకోవడం లేదని, మోసపూరితంగా తమ పేరున్న భూమిని కాజేశారని ఆరోపిస్తూ హుజూరాబాద్ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన ముషం వీరమల్లు, ఆయన భార్య బుచ్చి మల్లమ్మ సోమవారం ఆర్డీఓను ఆశ్రయించారు. అనారోగ్యంతో పాటు పక్షవాతంతో బాధపడుతున్నప్పటికీ కార్యాలయానికి వచ్చి తమ గోడును వినిపించారు.
తమ చిన్న కుమారుడు మృతి చెందిన తర్వాత మనవళ్లను పెంచి పెద్ద చేసి, అప్పులు చేసి ఉన్నత చదువులు చదివించామని, ప్రస్తుతం ఉద్యోగాల్లో ఉన్నప్పటికీ తమను పట్టించుకోవడం లేదని వృద్ధ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. వృద్ధాప్యంలో తమకు ఆసరాగా ఉంటుందని కొనుగోలు చేసిన రాంపూర్ సమీపంలోని సర్వే నంబర్ 170/బిలో 322.43 చదరపు గజాల స్థలాన్ని తమకు తెలియకుండా ముగ్గురు మనవళ్లు రీ-రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఆరోపించారు.
చిన్న మనవడు ముషం ప్రశాంత్ చదువుల కోసం రూ.6.39 లక్షలు అప్పు చేసి చదివించామని, ప్రస్తుతం ఉద్యోగంలో ఉన్నప్పటికీ తమను ఆదుకోవడం లేదన్నారు. తమ భూమిని తిరిగి తమ పేరుపై నమోదు చేయడంతో పాటు తమ సంరక్షణ బాధ్యతను కొడుకు, మనవళ్లతో నిర్వర్తింపజేయాలని, నెలవారీ పోషణ భత్యం ఇప్పించాలని ఆర్డీఓకు వినతిపత్రం సమర్పించారు. తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్ల పోషణ మరియు సంక్షేమ చట్టం–2007 ప్రకారం తమకు న్యాయం చేయాలని కోరారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
