
రామగుండంలో ప్రతి నిరుపేదకు పక్కా ఇల్లు.. దరఖాస్తుల పరిశీలన రెండు రోజుల్లో పూర్తి చేయాలి: కలెక్టర్ కోయ శ్రీహర్ష
పెద్దపల్లి, జూలై 7 (జిందగి9న్యూస్): రామగుండం నియోజకవర్గంలో అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి పక్కా ఇల్లు మంజూరు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, ఇందుకోసం రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల పరిశీలనను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె. అరుణశ్రీతో కలిసి నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల పరిశీలన పురోగతిని సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, క్షేత్రస్థాయిలో ఉన్న ఎల్-1 (L1), ఎల్-2 (L2) దరఖాస్తుల పరిశీలనను గెజిటెడ్ అధికారులు రాబోయే రెండు రోజుల్లో పూర్తి చేయాలని స్పష్టం చేశారు. మొదటి, రెండో దశల్లో ఇందిరమ్మ కమిటీల నుంచి వచ్చిన జాబితాలను సమగ్రంగా పరిశీలించి, అర్హుల ఎంపికలో పారదర్శకత పాటించాలని సూచించారు.
ప్రస్తుతం గుడిసెల్లో నివసిస్తున్న నిరుపేదలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, రామగుండం నగరాన్ని గుడిసెలు లేని ప్రాంతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం దరఖాస్తులను పరిశీలించి, ఎల్-2 జాబితాలోని అర్హులను ఎల్-1 జాబితాకు పంపిస్తూ ప్రతి అర్హుడికి ఇందిరమ్మ ఇల్లు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
సమావేశంలో హౌసింగ్ పీడీ రాజేశ్వర్, ఆర్డీవో గంగయ్య, ఈడీఎం కవితతో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
