రూ.300 కోట్ల అక్రమాస్తుల కేసులో డీఎస్పీ భీమ్‌రెడ్డి అరెస్ట్

హైదరాబాద్, జూలై 6 (Zindagi9news): ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ (PCS) డీఎస్పీ సంకిరెడ్డి భీమ్‌రెడ్డిని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు అరెస్ట్ చేశారు. నాలుగు రోజుల క్రితం భీమ్‌రెడ్డికి చెందిన నివాసాలు, కార్యాలయాలు, బంధువులు, బినామీలకు సంబంధించిన మొత్తం 15 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సుమారు రూ.300 కోట్ల విలువైన అక్రమాస్తులు ఉన్నట్లు గుర్తించారు. విల్లాలు, ఫ్లాట్లు, వ్యవసాయ భూములు, వాణిజ్య సముదాయాల్లో వాటాలు, నగదు, బంగారం, వెండి, బ్యాంకు డిపాజిట్లు, విదేశీ మద్యం సీసాలు తదితర ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. సోదాల్లో లభించిన ఆధారాలు, పత్రాల పరిశీలన అనంతరం భీమ్‌రెడ్డిని అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు, కేసుపై దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
