సీసీటీవీ నిఘాతో నేరాల నియంత్రణ.. కమిషనరేట్లో మరో 700 కెమెరాల ఏర్పాటు లక్ష్యం: సీపీ గౌష్ ఆలం

జమ్మికుంట/హుజురాబాద్, జూలై 9 (Zindagi9news): శాంతిభద్రతల పరిరక్షణలో, నేరాల నియంత్రణలో సీసీటీవీ కెమెరాల పాత్ర అత్యంత కీలకమని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం, ఐపీఎస్ పేర్కొన్నారు. హుజురాబాద్ డివిజన్ పరిధిలోని జమ్మికుంట మండలం సైదాబాద్ గ్రామంలో ఏర్పాటు చేసిన 16 సీసీ కెమెరాలు, కొరపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన 5 సీసీ కెమెరాలను గురువారం ఆయన ప్రారంభించారు.

అనంతరం జమ్మికుంట పట్టణ, రూరల్ పోలీసుల ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన వాలీబాల్ టోర్నమెంట్ విజేతలకు సీపీ బహుమతులు అందజేశారు. జమ్మికుంటలో నిర్వహించిన అవగాహన సదస్సులో విద్యార్థులు, ఆటో డ్రైవర్లు, ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన, కమిషనరేట్ పరిధిలోని ప్రతి గ్రామం, ప్రతి పట్టణం సీసీటీవీ నిఘా పరిధిలోకి తీసుకురావడమే లక్ష్యమని తెలిపారు. త్వరలోనే మరో 700 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

సైబర్ నేరాలు, ఆన్లైన్ గేమింగ్ బారిన పడకుండా యువత అప్రమత్తంగా ఉండాలని, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉండి క్రీడలపై దృష్టి సారించాలని సూచించారు. గ్రామాల్లో మత్తు పదార్థాల విక్రయం లేదా వినియోగంపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు లేదా డయల్–100కు సమాచారం అందించాలని కోరారు.

రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సీపీ సూచించారు. ప్రమాద బాధితులను సకాలంలో ఆస్పత్రికి తరలించి ప్రాణాలు కాపాడిన వారికి ప్రభుత్వం ‘రహవీర్ పథకం’ కింద రూ.25 వేల నగదు బహుమతి అందిస్తోందని ప్రజలకు వివరించారు.

సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన సైదాబాద్ సర్పంచ్ రాజారామ్, కొరపల్లి సర్పంచ్ మధుసూదన్, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్థులకు సీపీ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో హుజురాబాద్ ఏసీపీ మాధవి, జమ్మికుంట సీఐ రామకృష్ణ, రూరల్ ఇన్స్పెక్టర్ వెంకట్, ఎస్సైలు ఆవుల తిరుపతి, స్వాతి, క్రాంతి, పోలీసు సిబ్బంది, ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు.


Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
