మనవడితో పూరీలు చేసిన రేవంత్ రెడ్డి: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మధుర క్షణాలు

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తన బిజీ షెడ్యూల్ నుండి కాస్త సమయాన్ని కేటాయించి, తన మనవడితో గడిపిన సరదా క్షణాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. నిరంతరం ప్రజా జీవితంలో, రాజకీయ వ్యవహారాలతో తీరిక లేకుండా గడిపే ఆయన, ఇంట్లో ఒక సాధారణ తాతగా మారి మనవడి కోరికను తీర్చడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ఆయన తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేస్తూ, “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటా” అని మనవడు అడిగితే తప్పుతుందా? అంటూ ఎంతో ఆప్యాయంగా రాసుకొచ్చారు. పక్కనే మనవడు కూర్చోగా, చేతిలో పిడికెడు పిండి, దోసిట్లో నవ్వులు కురిపిస్తూ, గుండ్రంగా లేని ఒక డజన్ పూరీలు చేసినట్లు ఆయన సరదాగా పేర్కొన్నారు. బిజీ బిజీగా సాగుతున్న తన ప్రజా జీవితంలో.. మనవడితో కలిసి పూరీలు వేస్తూ గడిపిన ఈ కొన్ని క్షణాలు, తనకు ఎప్పటికీ గుర్తిండిపోయే మధుర జ్ఞాపకాలని ముఖ్యమంత్రి భావోద్వేగానికి లోనయ్యారు. ఈ పోస్ట్‌తో పాటు మనవడితో కలిసి కిచెన్‌లో పూరీలు చేస్తున్న ఒక అందమైన వీడియోను కూడా ఆయన షేర్ చేశారు. #Family అనే హ్యాష్ ట్యాగ్‌తో పెట్టిన ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. సీఎం రేవంత్ రెడ్డిలోని ఈ సరికొత్త ఫ్యామిలీ మ్యాన్ కోణాన్ని చూసి నెటిజన్లు, అభిమానులు లైకులు, కామెంట్లతో ముంచెత్తుతున్నారు.
