ప్రతి పౌరుడికి ‘సమగ్ర సంక్షేమ కార్డ్’.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల వివరాలన్నీ ఒకే కార్డులో అందుబాటులో ఉండేలా ‘సమగ్ర సంక్షేమ కార్డ్ (యూనిఫైడ్ కార్డ్)’ రూపొందించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఏ పౌరుడికి ఏ శాఖ ద్వారా, ఏ పథకం కింద, ఎంత మేర లబ్ధి చేకూరుతోందో ఈ కార్డ్ ద్వారా స్పష్టంగా తెలిసేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సీఎస్ రామకృష్ణారావు, సీఎం స్పెషల్ సెక్రటరీ బి. అజిత్ రెడ్డి, ఐటీ శాఖ జాయింట్ సెక్రటరీ అనుదీప్ దురిశెట్టి తదితరులతో జరిగిన సమీక్ష సమావేశంలో సీఎం ఈ అంశంపై ప్రత్యేకంగా చర్చించారు. అన్ని శాఖల నుంచి లబ్ధిదారుల డేటాను సేకరించేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు.
సమగ్ర సంక్షేమ కార్డ్ ద్వారా ప్రతి పౌరుడి పూర్తి సంక్షేమ ప్రొఫైల్ ఒకేచోట అందుబాటులోకి వస్తుందని సీఎం పేర్కొన్నారు. ఈ డేటాను ఏఐ (కృత్రిమ మేధస్సు) సహాయంతో విశ్లేషిస్తే సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత పెరిగి, నిజమైన అర్హులకు ప్రయోజనాలు మరింత ఖచ్చితంగా చేరుతాయని అభిప్రాయపడ్డారు. అనర్హులను గుర్తించడం కూడా సులభమవుతుందని తెలిపారు.
ప్రస్తుతం వివిధ శాఖలు వేర్వేరుగా కార్డులు జారీ చేసే విధానానికి బదులుగా, ఐటీ శాఖ ఆధ్వర్యంలో ఒకే సమగ్ర సంక్షేమ కార్డ్ ఉండాలని సీఎం సూచించారు. ఈ కార్డ్‌లో ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయ నిధి, ఫీజు రీయింబర్స్మెంట్, కార్మిక శాఖ, విద్యా శాఖ, బీమా పథకాల వివరాలు ఉండేలా రూపొందించాలని ఆదేశించారు.
అవసరమైతే ఆధార్ తరహాలో రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక యూనిక్ ఐడెంటిటీ నంబర్ ఇవ్వాలని, ఇటీవల నిర్వహించిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే వివరాలను కూడా కార్డ్‌కు అనుసంధానించాలని సూచించారు.
అదేవిధంగా, మరణ ధృవీకరణ పత్రం జారీ అయిన వెంటనే సంబంధిత సమాచారం చేయూత పెన్షన్ డేటాబేస్కు చేరేలా ఏఐ ఆధారిత ప్రొఫైలింగ్ వ్యవస్థ ఉండాలని సీఎం పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్య ప్రొఫైల్‌ను కూడా ఈ కార్డ్‌తో అనుసంధానించాలని అధికారులకు సూచించారు.
గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం వెళ్లే యువతకు కేరళ మాదిరి విధానాలను అధ్యయనం చేయాలని, నైపుణ్యాభివృద్ధి, పాస్‌పోర్ట్, వీసా సంబంధిత సమాచారాన్ని ఒకేచోట అందుబాటులో ఉంచే వ్యవస్థను పరిశీలించాలని సీఎం అధికారులకు సూచించారు. పేదలకు సంక్షేమ ఫలాలు ఖచ్చితంగా చేరేలా, ప్రతి పథకం ప్రభావాన్ని అంచనా వేసేలా ఈ సమగ్ర సంక్షేమ కార్డ్ ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
