ఉపాధ్యాయులు, విద్యార్థులకు శుభవార్త.. BRAOUలో ఐదు కొత్త కోర్సులకు యూజీసీ ఆమోదం
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి ఐదు కొత్త కోర్సులకు యూజీసీ గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్, జూలై 15 (Zindagi9news): డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ (BRAOU)కి ఐదు కొత్త కోర్సులకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఆమోదం తెలిపినట్లు వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి వెల్లడించారు. కొత్తగా ఎం.ఏ. ఎడ్యుకేషన్, ఎం.ఏ. ఎడ్యుకేషన్ (స్కూల్ అడ్మినిస్ట్రేషన్), మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ (MSW), ఎం.ఎస్సీ (జియోగ్రఫీ) కోర్సులతో పాటు బి.ఎడ్ (స్పెషల్ ఎడ్యుకేషన్) కోర్సుకు అనుమతి పునరుద్ధరణ లభించినట్లు తెలిపారు.
జూన్ నెలలో యూజీసీ నిపుణుల కమిటీ వర్చువల్ విధానంలో యూనివర్సిటీ మౌలిక సదుపాయాలు, అధ్యాపక సిబ్బంది, విద్యా ప్రమాణాలను పరిశీలించిన అనంతరం ఈ కోర్సులకు ఆమోదం తెలిపిందన్నారు. ఈ కోర్సుల రూపకల్పనలో తెలంగాణ ప్రభుత్వ సహకారం కీలకమైందని, రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగిత రాణా సూచనల మేరకు ఉపాధ్యాయుల వృత్తి నైపుణ్యాభివృద్ధికి ఉపయోగపడేలా కోర్సులను రూపొందించినట్లు తెలిపారు.
ఎం.ఏ. ఎడ్యుకేషన్, ఎం.ఏ. స్కూల్ అడ్మినిస్ట్రేషన్, బి.ఎడ్. (స్పెషల్ ఎడ్యుకేషన్) కోర్సులు సేవలో ఉన్న ఉపాధ్యాయుల విద్యార్హతలు, నాయకత్వ లక్షణాలు, పరిపాలనా నైపుణ్యాలను పెంపొందించేందుకు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. త్వరలో తెలంగాణ విద్యాశాఖతో అవగాహన ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు వెల్లడించారు.
ఎంఎస్‌డబ్ల్యూ, ఎంఎస్సీ (జియోగ్రఫీ) కోర్సులకు దేశవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉందని, వీటి ప్రవేశాలకు సంబంధించిన అర్హతలు, ఫీజులు, కోర్సు వ్యవధి, స్టడీ సెంటర్ల వివరాలతో త్వరలో అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపారు. విద్యార్థులు తాజా సమాచారం కోసం braou.ac.in, braouonline.in వెబ్సైట్లను సందర్శించాలని, లేదా 040-23680333 / 040-23680555 హెల్ప్‌డెస్క్ నంబర్లను సంప్రదించాలని యూనివర్సిటీ సూచించింది.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
