బోర్వెల్ అనుమతికి రూ.20 వేల లంచం.. ఏసీబీ వలలో జిల్లా భూగర్భ జలాల అధికారి

హైదరాబాద్, జూలై 15 (జిందగి9న్యూస్): సూర్యాపేట జిల్లా భూగర్భ జలాల శాఖలో లంచం తీసుకుంటూ జిల్లా గ్రౌండ్ వాటర్ అధికారి (District Ground Water Officer) మేగావత్ బాలుతో పాటు ఔట్సోర్సింగ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ కోసనోజు వెంకటేశ్వర్లు అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులకు బుధవారం పట్టుబడ్డారు.
ఏసీబీ తెలిపిన వివరాల ప్రకారం, ఫిర్యాదుదారుడి బోర్వెల్ డ్రిల్లింగ్ రిగ్‌కు అనుమతి మంజూరు చేయడం, అవసరం లేని జరిమానాలు విధించకుండా లేదా రిగ్‌ను స్వాధీనం చేసుకోకుండా ఉండేందుకు జిల్లా గ్రౌండ్ వాటర్ అధికారి మేగావత్ బాలు రూ.20,000 లంచం డిమాండ్ చేశాడు. ఈ మొత్తాన్ని ఔట్సోర్సింగ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ కోసనోజు వెంకటేశ్వర్ల ద్వారా స్వీకరిస్తుండగా నల్గొండ రేంజ్ ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
డేటా ఎంట్రీ ఆపరేటర్ వద్ద నుంచి రూ.20 వేల లంచం నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగులుగా తమ విధులను దుర్వినియోగం చేసి అక్రమ లాభం పొందేందుకు ప్రయత్నించినట్లు విచారణలో తేలిందని పేర్కొంది.
ఇద్దరు నిందితులను నాంపల్లి ప్రత్యేక ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని, ఫిర్యాదుదారుడి వివరాలను భద్రతా కారణాల దృష్ట్యా గోప్యంగా ఉంచినట్లు ఏసీబీ వెల్లడించింది.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
