కారులో యువతి మృతదేహం.. హన్మకొండలో కలకలం

హన్మకొండ, ఆగస్టు 21 (జిందగీ9న్యూస్): హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో కారులో లభ్యమైన గుర్తుతెలియని యువతి మృతదేహాన్ని గోదావరిఖని సెంటినరీ కాలనీకి చెందిన మానసగా పోలీసులు గుర్తించారు. కారు నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా, కారును తనిఖీ చేసిన పోలీసులు డిక్కీలో మృతదేహాన్ని గుర్తించారు.
ఘటనా స్థలంలో లభించిన ఆధార్ కార్డు ఆధారంగా మృతదేహాన్ని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. కారు యజమాని సురేందర్‌ను విచారించగా, కొద్ది రోజుల క్రితం వినోద్ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి కారును అద్దెకు తీసుకున్నట్లు తెలిసింది. వినోద్‌ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.
విచారణలో కరీంనగర్‌లోని ఓ గదిలో ఉన్న సమయంలో మానసకు ఫిట్స్ వచ్చి మృతి చెందినట్లు, భయంతో మృతదేహాన్ని కారులో ఉంచి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు వినోద్ పోలీసులకు తెలిపినట్లు సమాచారం. అయితే మృతికి అసలు కారణం ఏమిటన్నది పోస్టుమార్టం నివేదిక, పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు.
