నీట్లో బీసీ గురుకుల విద్యార్థుల సత్తా.. 193 మందిలో 176 మంది అర్హత
25 మందికి పైగా ఎంబీబీఎస్, 70 మందికి పైగా ఇతర వైద్య కోర్సుల్లో సీట్ల అవకాశం
బాలికలదే ఆధిక్యం.. 165 మందిలో 154 మంది ఉత్తీర్ణత
బీసీ గురుకులాల్లో నాణ్యమైన విద్యకు నిదర్శనమన్న మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్, జూలై 17(Zindagi9news): మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ బీసీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ ఆధ్వర్యంలో చదువుతున్న విద్యార్థులు ఈ ఏడాది నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET)లో విశేష ప్రతిభ కనబరిచారు. మొత్తం 193 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా, వారిలో 176 మంది అర్హత సాధించారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఉత్తీర్ణుల సంఖ్య పెరగడంతో 25 మందికి పైగా విద్యార్థులకు ఎంబీబీఎస్‌లో, 70 మందికి పైగా విద్యార్థులకు బీడీఎస్, వెటర్నరీ, హోమియోపతి, ఆయుర్వేద, యునానీ కోర్సుల్లో సీట్లు లభించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఈ ఏడాది నీట్ పరీక్ష రాసిన 165 మంది బాలికల్లో 154 మంది, 28 మంది బాలురలో 22 మంది అర్హత సాధించారు. విద్యార్థుల్లో బి. హిమణి (490), జి. సుప్రియ (485), ఎం. శివాత్మిక (473), బి. కల్పిత (466), జి. హర్షిణి (450), కె. సాయి సోనిక (449), ఎం. గౌతమి (448), ఎస్. స్నిగ్ధ (432), పి. త్రిష (424), కె. శ్రావణ్ కుమార్ (417), జి. అక్షిత (414), ఎల్. శ్రియ (408), కె. స్వాతి (407), టి. ముత్తవ్వ (406), జి. కీర్తి (402) అత్యుత్తమ మార్కులు సాధించారు.
బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ పేద బీసీ విద్యార్థులు వైద్య విద్యకు అర్హత సాధించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా బీసీ గురుకులాల్లో నాణ్యమైన విద్య అందిస్తున్నందుకు ఈ ఫలితాలే నిదర్శనమని పేర్కొన్నారు. ఉత్తీర్ణులైన విద్యార్థులు, అధ్యాపకులు, గురుకుల సిబ్బందిని ఆయన అభినందించారు.
బీసీ సంక్షేమ శాఖ సలహాదారు వి. హనుమంతరావు మాట్లాడుతూ పేదలకు ఉన్నత విద్యను చేరువ చేయడంలో బీసీ గురుకులాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. ఇదే స్ఫూర్తితో గురుకుల సిబ్బంది మరింత అంకితభావంతో పనిచేయాలని సూచించారు.
బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి (ఎఫ్ఏసీ), కమిషనర్ బాలమాయదేవి, బీసీ గురుకుల కార్యదర్శి బడుగు సైదులు ఉత్తీర్ణులైన విద్యార్థులు, అధ్యాపకులను అభినందిస్తూ భవిష్యత్తులో మరింత ఉన్నత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
