ప్రేమ పేరుతో మైనర్‌పై దారుణం.. ముగ్గురు లైంగిక దాడి, ఏఆర్ కానిస్టేబుల్ పరారీ
భద్రాద్రి కొత్తగూడెంలో ఘటన.. ఆరుగురిపై పోక్సో, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసులు

భద్రాద్రి కొత్తగూడెం, జూలై 16 (Zindagi9News): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 14 ఏళ్ల మైనర్ బాలికపై ముగ్గురు యువకులు లైంగిక దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఈ కేసులో నిందితులకు సహకరించిన మరో ముగ్గురితో కలిపి మొత్తం ఆరుగురిపై పోలీసులు పోక్సో, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టాల కింద కేసులు నమోదు చేశారు. నలుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించగా, పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. పరారీలో ఉన్న వారిలో ఒకరు ఏఆర్ కానిస్టేబుల్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
పోలీసుల వివరాల ప్రకారం.. తండ్రిని కోల్పోయిన బాలిక తల్లితో కలిసి కొత్తగూడెంలో నివసిస్తోంది. చుంచుపల్లి మండలం గరీబ్‌పేటకు చెందిన ఆటోడ్రైవర్ మార్తి రామకృష్ణ ప్రేమ పేరుతో బాలికకు దగ్గరయ్యాడు. ఈ నెల 3న పెళ్లి విషయమై మాట్లాడదామని చెప్పి ఓల్డ్ డిపో ప్రాంతంలోని తన బావ, ఏఆర్ కానిస్టేబుల్ వెంకటేష్ గదికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం ఈ విషయాన్ని తన స్నేహితులు విజేందర్, మహేష్‌కు చెప్పగా, వారు విషయం బయటపెడతామని బెదిరించి ఈ నెల 4, 5 తేదీల్లో బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.
బాలిక ప్రవర్తనలో మార్పు గమనించిన తల్లి ఈ నెల 11న ప్రశ్నించగా జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆమె కొత్తగూడెం టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నలుగురు నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి రిమాండ్‌కు తరలించారు. నిందితుల నుంచి మూడు ఆటోలు, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న ఇద్దరి కోసం గాలింపు కొనసాగుతోందని, మహిళలు, బాలికలపై నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ తెలిపారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
