కొత్త పార్టీ ప్రచారంపై బండి సంజయ్ క్లారిటీ.. “కాషాయం కండువాలోనే నా ప్రయాణం”

హైదరాబాద్, మే 20(Zindagi9News):
తాను కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు జరుగుతున్న ప్రచారంపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఘాటుగా స్పందించారు. తన రాజకీయ జీవితం పూర్తిగా బీజేపీ సిద్ధాంతాలకు అంకితమైందని స్పష్టం చేశారు.
“నేనేంటో నా ప్రజలకు తెలుసు, పార్టీకి తెలుసు, నా కార్యకర్తలకు తెలుసు. కనుమూసినా కాషాయం కండువాలోనే అనుకునే నిబద్ధత నాది. కట్టె కాలేదాకా సిద్ధాంతం కోసమే బతికే నిజాయతీ నాది” అని బండి సంజయ్ పేర్కొన్నారు.
తాను కొత్త పార్టీ పెట్టాలనే ఆలోచన ఎప్పుడూ చేయలేదని, అలాంటి ప్రచారాలు పూర్తిగా నిరాధారమని స్పష్టం చేశారు. “కొత్త పార్టీ పెట్టాలనే చెత్త ఆలోచన నాకు లేదు. అలాంటి చెత్త ప్రచారాలపై స్పందించాల్సిన అవసరమూ లేదు” అని ఆయన పేర్కొన్నారు.
ఇటీవల సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో జరుగుతున్న ఊహాగానాలకు బండి సంజయ్ వ్యాఖ్యలు చెక్ పెట్టినట్టయ్యాయి. బీజేపీ పట్ల తన నిబద్ధత ఎప్పటికీ కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.
