కరీంనగర్ జిల్లాలో దారుణం.. వాహనాన్ని అడ్డగించి దోపిడీ.. 8 మంది అరెస్ట్

జమ్మికుంట/హుజూరాబాద్, మే 21 (Zindagi9News):
కరీంనగర్ జిల్లా జమ్మికుంట లో మే 20న అర్ధరాత్రి జరిగిన దోపిడీ ఘటన కలకలం రేపింది. వాహనాన్ని అడ్డగించి ఇద్దరు ఎడ్ల వ్యాపారులను బెదిరించి నగదు, బంగారు ఆభరణాలు దోచుకున్న ముఠాను పోలీసులు చాకచక్యంగా పట్టుకుని అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో 8 మంది నిందితులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి నగదు, బంగారు ఉంగరం, వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం.. మే 20వ తేదీ రాత్రి సుమారు 11 గంటల సమయంలో కోరపల్లి రోడ్డులో వెళ్తున్న అశోక్ లేలాండ్ బడా దోస్త్ వాహనం (TS-08-UD-5457)ను 11 మంది గుర్తుతెలియని వ్యక్తులు అడ్డగించారు. వాహనంలో ప్రయాణిస్తున్న ఇద్దరు ఎడ్ల వ్యాపారులపై దాడి చేసి సమీపంలోని ఖాళీ స్థలానికి తీసుకెళ్లి భయభ్రాంతులకు గురిచేశారు.
అనంతరం బాధితుల వద్ద ఉన్న నగదు, అర తులం బంగారు ఉంగరం, మొబైల్ ఫోన్ ద్వారా ఫోన్‌పే లావాదేవీలతో కలిపి మొత్తం రూ.38 వేల నగదు దోచుకున్నట్లు సమాచారం. అంతటితో ఆగకుండా మరో రూ.1 లక్ష ఇవ్వాలని బెదిరిస్తూ రైల్వే స్టేషన్ వైపు తీసుకెళ్తుండగా, బాధితులు గట్టిగా అరవడంతో స్థానికులు అప్రమత్తమయ్యారు. దీంతో నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.
సమాచారం అందుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టారు. గురువారం ఉదయం సైదాబాద్ ఎక్స్ రోడ్డు వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా తిరుగుతున్న 8 మందిని అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో నేరాన్ని అంగీకరించడంతో వారిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
అరెస్టైన నిందితులు పల్లపు ఈశ్వర్ (అలియాస్ బన్నీ), పల్లపు అశోక్, ఎలకపల్లి ప్రమోద్, చొక్కరపు అఖిలేష్, మెగుళ్ల రాకేష్, పల్లపు మహేష్ (తండ్రి: మల్లయ్య), పల్లపు మహేష్ (తండ్రి: రాములు), తపేల వంశీగా గుర్తించారు.
నిందితుల వద్ద నుంచి రూ.14,000 నగదు, అర తులం బంగారు ఉంగరం, 4 ద్విచక్ర వాహనాలు (బజాజ్ CT-100, యమహా, ప్యాషన్ ప్రో, పల్సర్ 220) స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ కేసులో ఇంకా పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
