“మాకు కిడ్నీలు ఇప్పించండి”.. రాష్ట్రపతికి ఐదుగురు మహిళల వేడుకోలు
సిజేరియన్ తర్వాత తీవ్ర కిడ్నీ సమస్యలు.. డయాలసిస్‌తో విసిగిపోయామని ఆవేదన

కోటా (రాజస్థాన్), జూలై 16 (Zindagi9News): రాజస్థాన్‌లోని కోటాలో సిజేరియన్ శస్త్రచికిత్స అనంతరం తీవ్రమైన కిడ్నీ సమస్యలు ఎదుర్కొంటున్న ఐదుగురు మహిళలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. తమకు తక్షణమే కిడ్నీ మార్పిడి జరిగేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకుని సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
రెండు నెలలకు పైగా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నామని, నవజాత శిశువులను కూడా చూసుకోలేని పరిస్థితి ఏర్పడిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పదేపదే డయాలసిస్ చేయించుకోవడం వల్ల తీవ్ర శారీరక, మానసిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. కిడ్నీ మార్పిడిపై ప్రభుత్వం నుంచి లిఖితపూర్వక హామీ ఇవ్వాలని బాధిత కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఇదిలా ఉండగా, బాధిత మహిళలకు వైద్యపరంగా అవసరమైనంత కాలం డయాలసిస్ కొనసాగిస్తామని న్యూ మెడికల్ కాలేజ్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ప్రస్తుతం కిడ్నీ మార్పిడి చేయడం వైద్యపరంగా ప్రమాదకరమని, రాబోయే రోజుల్లో కిడ్నీల పనితీరు తిరిగి మెరుగుపడే అవకాశాలను ముందుగా అంచనా వేసిన తర్వాతే తదుపరి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.
