నేటి నుంచి క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల స్వీకరణ
మీ సేవ కేంద్రాలు, వాట్సాప్ ద్వారా దరఖాస్తులకు అవకాశం
ఆగస్టు 10 వరకు గడువు.. అర్హులు వినియోగించుకోవాలని ప్రభుత్వం సూచన

హైదరాబాద్, జూలై 21 (Zindagi9News): క్యూర్ (Core Urban Region) పరిధిలోని అర్హులైన పౌరుల కోసం ఇందిరమ్మ ఇళ్ల పథకానికి దరఖాస్తుల స్వీకరణను తెలంగాణ ప్రభుత్వం మంగళవారం నుంచి ప్రారంభించింది. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో ఈ సేవలను మీ సేవ కేంద్రాలు, మీ సేవ వాట్సాప్ ద్వారా అందుబాటులోకి తీసుకువచ్చారు. దరఖాస్తుల ప్రక్రియ జూలై 21 నుంచి ఆగస్టు 10 వరకు కొనసాగనుంది.
అర్హులైన లబ్ధిదారులు తమ సమీపంలోని మీ సేవ కేంద్రంలో లేదా మీ సేవ వాట్సాప్ నంబర్ 8096958096కు “Hi” అని సందేశం పంపి చాట్‌బాట్ సూచనల మేరకు మొబైల్ ద్వారానే దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే మీ సేవ పోర్టల్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవడంతో పాటు అప్లికేషన్ స్టేటస్‌ను ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశం కల్పించారు.
ఈ సేవల ద్వారా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం తగ్గడంతో పాటు దరఖాస్తు ప్రక్రియ మరింత పారదర్శకంగా, సులభంగా మారుతుందని అధికారులు తెలిపారు. దరఖాస్తు చేసే ముందు ఆధార్ కార్డు వివరాలు, అవసరమైన పత్రాల స్కాన్ కాపీలు లేదా స్పష్టమైన ఫోటోలను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ గడువులోగా దరఖాస్తు చేసుకుని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.
