ఇందిరమ్మ టవర్స్‌పై సందేహాలకు హెల్ప్‌లైన్.. 040-24603572 ప్రారంభించిన మంత్రి పొంగులేటి
దరఖాస్తుకు ఆధార్ ఒక్కటే చాలు.. యూపీఐ ద్వారానే రూ.10 వేల ఈఎండీ చెల్లింపు.. ఇల్లు రాకపోతే పూర్తి మొత్తం వాపసు

హైదరాబాద్, జూలై 25 (జిందగి9న్యూస్): హైదరాబాద్ క్యూర్ (Core Urban Region) పరిధిలో పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు నగర నడిబొడ్డున గౌరవప్రదమైన సొంతింటిని అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ టవర్స్ పథకంపై ప్రజలకు పూర్తి సమాచారం అందించేందుకు ప్రత్యేక కాల్‌సెంటర్ హెల్ప్‌లైన్‌ను రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార & పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం ప్రారంభించారు. ఇందుకోసం 040-24603572 హెల్ప్‌లైన్ నంబర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.
మంత్రి మాట్లాడుతూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి దరఖాస్తు విధానం, అర్హతలు, చెల్లింపులు, కేటాయింపు విధానం తదితర అంశాలపై అధికారిక సమాచారం పొందవచ్చని తెలిపారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో సేవలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. ప్రజలు మధ్యవర్తులను నమ్మకుండా నేరుగా ప్రభుత్వాన్ని సంప్రదించాలని సూచించారు.
హైదరాబాద్ క్యూర్ పరిధిలో లక్ష ఇళ్ల నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని, తొలి విడతలో 16 నియోజకవర్గాల్లో 7,680 ఫ్లాట్ల నిర్మాణం ప్రారంభించినట్లు మంత్రి వెల్లడించారు. దరఖాస్తుదారులు తమకు చెందిన నియోజకవర్గంలోనే దరఖాస్తు చేసుకోవాలని, మీ సేవ కేంద్రాలు, ఆన్లైన్ పోర్టల్ లేదా వాట్సాప్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించినట్లు తెలిపారు.
ఈ పథకానికి క్యూర్ పరిధిలో కనీసం 10 సంవత్సరాలుగా నివసిస్తున్న కుటుంబాలు అర్హులని, కుటుంబ వార్షిక ఆదాయం రూ.6 లక్షలలోపు ఉండాలని పేర్కొన్నారు. దరఖాస్తుదారు లేదా కుటుంబ సభ్యుల పేరుపై క్యూర్ పరిధిలో సొంత ఇల్లు, ఫ్లాట్ లేదా ప్లాట్ ఉండకూడదని, ఒక కుటుంబానికి ఒకే దరఖాస్తు, ఒకే ఫ్లాట్ కేటాయింపు ఉంటుందని స్పష్టం చేశారు.
దరఖాస్తు సమయంలో ఆధార్ నంబర్ ఒక్కటే సరిపోతుందని, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలను అప్పుడే అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదని తెలిపారు. లాటరీ సమయంలో అవసరమైన పత్రాలు సమర్పించవచ్చన్నారు. దరఖాస్తు సమయంలో రూ.10 వేల ఈఎండీని యూపీఐ లేదా నెట్‌బ్యాంకింగ్ ద్వారానే చెల్లించాలని, ఒకవేళ ఫ్లాట్ కేటాయింపు జరగకపోతే అదే బ్యాంకు ఖాతాకు మొత్తం తిరిగి జమ చేస్తామని హామీ ఇచ్చారు. దరఖాస్తు సంఖ్య, మీ సేవ రసీదు, చెల్లింపు రసీదు, మొబైల్ నంబర్‌ను ప్రక్రియ పూర్తయ్యే వరకు భద్రంగా ఉంచుకోవాలని సూచించారు.
ఈ పథకం కింద నిర్మించే ఫ్లాట్లు ఒక బెడ్రూమ్, హాల్, కిచెన్‌తో సుమారు 525 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటాయని మంత్రి తెలిపారు. ఒక్కో ఫ్లాట్ విలువ రూ.40 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు ఉండగా, ప్రభుత్వం రూ.5 లక్షల సబ్సిడీతో పాటు 20 నుంచి 25 గజాల అన్‌డివైడెడ్ షేర్‌ను లబ్ధిదారుడి పేరుతో రిజిస్ట్రేషన్ చేస్తుందని చెప్పారు. లబ్ధిదారుడు కేవలం రూ.6 లక్షలు మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
