అంకుశాపూర్ హత్య కేసు ఛేదన.. నిందితుడు అరెస్ట్

జమ్మికుంట, జూన్ 29(Zindagi9news): కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని మడిపెల్లి గ్రామ శివారులో జరిగిన అంకుశాపూర్ హత్య కేసును పోలీసులు ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేసినట్లు హుజురాబాద్ డివిజన్ ఏసీపీ వి. మాధవి తెలిపారు. సోమవారం జమ్మికుంట పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె కేసు వివరాలను వెల్లడించారు.
ఏసీపీ తెలిపిన వివరాల ప్రకారం.. జమ్మికుంట మండలం మడిపెల్లి గ్రామానికి చెందిన గంగారపు మహేష్ (40)ను సోమవారం ఉదయం 10.30 గంటలకు అతని నివాసం వద్ద అదుపులోకి తీసుకొని విచారించగా హత్య చేసినట్లు అంగీకరించాడు. తన వ్యవసాయ భూమి సమీపంలో వ్యవసాయం చేస్తున్న ఓ వివాహిత మహిళతో పరిచయం ఏర్పడిందని, ఆ మహిళపై మృతుడు పైతరి మొగిలి అత్యాచార యత్నానికి పాల్పడగా తాను ఆమెకు అండగా నిలిచి పోలీసులకు ఫిర్యాదు చేయించినట్లు తెలిపాడు. ఆ కేసులో జైలుకు వెళ్లి విడుదలైన తర్వాత మృతుడు తనను తరచూ అవమానిస్తూ, దూషిస్తూ ఉండటంతో పాటు కుటుంబ సమస్యలకు కూడా అతడే కారణమని భావించి కక్ష పెంచుకుని హత్యకు పాల్పడినట్లు నిందితుడు వెల్లడించినట్లు ఏసీపీ చెప్పారు.
ఈ నెల 27న పీర్ల పండుగ సందర్భంగా మడిపెల్లి గ్రామానికి వచ్చిన మృతుడిని గమనించిన నిందితుడు ముందుగా యూట్యూబ్‌లో హత్యలకు సంబంధించిన వీడియోలు, ఆయుధాల తయారీ విధానాలను శోధించిన అనంతరం ఇనుప రాడ్‌తో అంకుశాపూర్ వెళ్లే రోడ్డుపై దాడి చేసి హత్య చేసినట్లు విచారణలో తేలిందన్నారు.
నిందితుడి వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన ఇనుప రాడ్, రక్తపు మరకలున్న లుంగీ, నలుపు రంగు ఫుల్ హ్యాండ్స్ టీ-షర్ట్, యూట్యూబ్ శోధనలు చేసిన మోటరోలా ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్, ఘటనలో ఉపయోగించిన హీరో ప్యాషన్ ప్రో మోటార్‌సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ వి. మాధవి తెలిపారు. కేసులో దర్యాప్తు కొనసాగుతోందని ఆమె పేర్కొన్నారు.
కేసు దర్యాప్తులో విశేష కృషి చేసిన జమ్మికుంట సీఐ రామకృష్ణ గౌడ్, ఎస్సై రవి, ఏఎస్ఐ సంపత్తో పాటు దర్యాప్తు బృందంలోని పోలీసు అధికారులు, సిబ్బందిని ఏసీపీ వి. మాధవి అభినందించారు. నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ, ప్రజలు ఏవైనా అనుమానాస్పద సంఘటనలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
విలేకరుల సమావేశంలో జమ్మికుంట సీఐ రామకృష్ణ గౌడ్, ఎస్సై రవి, ఏఎస్ఐ సంపత్తో పాటు పలువురు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
