మహిళ హత్య కేసులో నిందితుడు అరెస్ట్.. 36 గంటల్లోనే కేసు ఛేదించిన హుజూరాబాద్ పోలీసులు

హుజూరాబాద్, జూలై 13 (జిందగి9న్యూస్): హుజూరాబాద్ మామిండ్లవాడలో మహిళ హత్య కేసును పోలీసులు కేవలం 36 గంటల్లోనే ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని హుజూరాబాద్ ఏసీపీ వాసంశెట్టి మాధవి సోమవారం పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
పోలీసుల వివరాల ప్రకారం, హుజూరాబాద్ మండలం పోతిరెడ్డిపేట గ్రామానికి చెందిన చింత సునీత (35) గత కొంతకాలంగా హుజూరాబాద్ మామిండ్లవాడలో నివాసం ఉంటోంది. ఆమె భర్త కుమార్ మరణించడంతో గత ఐదేళ్లుగా మోతే కిరణ్‌తో సహజీవనం చేస్తోంది. వీరిద్దరూ గ్యాస్ గోదాం సమీపంలోని అద్దె ఇంట్లో నివసిస్తున్నారు.
సునీత తన పక్కింట్లో నివసించే మహిళతో సన్నిహితంగా ఉండడాన్ని కిరణ్ వ్యభిచారంగా అనుమానించాడని, ఈ విషయమై ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవని పోలీసులు తెలిపారు. జూలై 10న ఇద్దరూ కలిసి మద్యం సేవించిన అనంతరం మరోసారి గొడవ జరగడంతో ఆగ్రహానికి గురైన కిరణ్, ముందుగా చేతులతో సునీత గొంతు పిసికి, అనంతరం గుడ్డ ముక్కతో గొంతు బిగించి, కాలితో మెడపై తొక్కి హత్య చేసినట్లు విచారణలో వెల్లడైందన్నారు.
హత్య అనంతరం ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకు మృతదేహాన్ని సమీపంలోని బావిలో పడవేశాడని, మృతురాలు ధరించిన లోదుస్తులను బావి సమీపంలోని చెట్టు వద్ద పడేసి అక్కడి నుంచి కరీంనగర్‌కు పరారైనట్లు పోలీసులు తెలిపారు.
సీఐ కరుణాకర్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం దర్యాప్తు చేపట్టగా, జూలై 13న నిందితుడు హుజూరాబాద్‌కు తిరిగి వచ్చినట్లు సమాచారం అందడంతో అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో నిందితుడు నేరాన్ని ఒప్పుకున్నట్లు ఏసీపీ తెలిపారు. నిందితుడి సూచన మేరకు సంఘటన జరిగిన ఇల్లు, మృతదేహాన్ని పడవేసిన బావి, దుస్తులు పడేసిన ప్రదేశాన్ని పరిశీలించి, పగిలిన గాజులు, గాజు ముక్కలు, పుస్తెల పూసలు, కాలి పట్టీతో పాటు కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
నిందితుడిని అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరిచినట్లు, కేసు దర్యాప్తు కొనసాగుతోందని ఏసీపీ తెలిపారు. కేసును వేగంగా ఛేదించిన సీఐ కరుణాకర్, ఎస్ఐలు రవి, శ్రీనివాసరావు, సిబ్బంది మోహన్, అవినాష్, మహేందర్, శ్రీధర్, అనిల్‌లను ఏసీపీ అభినందించారు.
