96.81 లక్షల మంది చిన్నారులకు ఆల్బండజోల్ మాత్రల పంపిణీ ప్రారంభం

హైదరాబాద్, జూలై 13 (జిందగి9న్యూస్): రాష్ట్రవ్యాప్తంగా 1 నుంచి 19 సంవత్సరాల వయస్సున్న 96,81,855 మంది చిన్నారులు, విద్యార్థులకు ఆల్బండజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సోమవారం ప్రారంభించారు. హైదరాబాద్‌లోని రాజ్‌భవన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులకు మంత్రి స్వయంగా ఆల్బండజోల్ మాత్రలు అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పిల్లల్లో నులిపురుగుల (నట్టలు) సమస్యను నివారించేందుకు ప్రతి చిన్నారికి ఆల్బండజోల్ మాత్ర తప్పనిసరిగా వేయించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. నులిపురుగుల కారణంగా రక్తహీనత, పోషకాహార లోపం, ఎదుగుదల మందగించడం, బరువు తగ్గడం వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో పాటు పిల్లల చదువుపై ఏకాగ్రత కూడా తగ్గే ప్రమాదం ఉందన్నారు. నులిపురుగులు బయటకు కనిపించకపోయినా పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని, అందువల్ల ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
ఆల్బండజోల్ మాత్రల వల్ల నులిపురుగుల సమస్య తొలగి, తిన్న ఆహారంలోని పోషకాలు శరీరానికి సమర్థవంతంగా అందుతాయని, రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు పిల్లల నేర్చుకునే సామర్థ్యం, చదువుపై ఏకాగ్రత కూడా మెరుగుపడుతుందని మంత్రి వివరించారు.
జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమం మాత్రల పంపిణీతో మాత్రమే పరిమితం కాదని, వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల శుభ్రత, సబ్బుతో చేతులు కడుక్కోవడం, పరిశుభ్రమైన తాగునీరు వినియోగించడం, పండ్లు, కూరగాయలను శుభ్రంగా కడిగి తినడం వంటి అలవాట్లపై కూడా పిల్లలు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని ఆరోగ్యశాఖ అధికారులను మంత్రి ఆదేశించారు.
విద్యాశాఖ, మహిళా-శిశు సంక్షేమ శాఖల సమన్వయంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈరోజు ఏ కారణంతోనైనా ఆల్బండజోల్ మాత్ర తీసుకోలేకపోయిన పిల్లలకు జూలై 20న నిర్వహించే మాప్-అప్ కార్యక్రమంలో తప్పనిసరిగా మాత్రలు అందజేయనున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ఆరోగ్యశాఖ ప్రధాన కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా జడ్. చొంగ్తు, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ, హైదరాబాద్ డీఎంహెచ్‌వో డాక్టర్ పి. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
