NIMS అదనపు మెడికల్ సూపరింటెండెంట్‌పై అక్రమ ఆస్తుల కేసు
రూ.6.13 కోట్ల ఆస్తులు గుర్తించినట్లు ACB వెల్లడి.. మరిన్ని ఆస్తులపై కొనసాగుతున్న తనిఖీలు

హైదరాబాద్, సెప్టెంబర్ 22: నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS)లో అదనపు మెడికల్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న నోరి లక్ష్మీ భాస్కర్‌పై అవినీతి నిరోధక శాఖ (ACB) అక్రమ ఆస్తుల కేసు నమోదు చేసింది. తెలిసిన ఆదాయ వనరులకు మించి ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలపై ఈ కేసు నమోదు చేసినట్లు ACB తెలిపింది.
మంగళవారం ఆయన నివాసంతో పాటు బంధువులు, స్నేహితులు, బినామీలు, ఇతర సంబంధిత వ్యక్తులకు చెందిన మొత్తం ఎనిమిది ప్రాంతాల్లో ACB అధికారులు సోదాలు నిర్వహించారు.
ఏసీబీ తెలిపిన వివరాలు ప్రకారం..సోదాల్లో కూకట్‌పల్లిలోని గేటెడ్ కమ్యూనిటీలో ఒక 4 బెడ్రూమ్ ఫ్లాట్, రెండు 3 బెడ్రూమ్ ఫ్లాట్లు, మణికొండ, పెట్బషీరాబాద్, కూకట్‌పల్లిలో ఐదు 2 బెడ్రూమ్ ఫ్లాట్లు ఉన్నట్లు గుర్తించినట్లు ACB వెల్లడించింది. అలాగే యాదాద్రి, నందిగామ, శామీర్‌పేటలో నాలుగు ఓపెన్ ప్లాట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో 800 చదరపు గజాల ఓపెన్ ప్లాట్ ఉన్నట్లు తెలిపింది.
అదేవిధంగా బ్యాంకు ఖాతాల్లో సుమారు రూ.41 లక్షలు, పోస్టాఫీసు డిపాజిట్లు రూ.12 లక్షలు, ప్రైవేట్ ఆర్థిక సంస్థల్లో పెట్టుబడులు రూ.35 లక్షలు, మ్యూచువల్ ఫండ్స్‌లో రూ.29.55 లక్షలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సుమారు 517.8 గ్రాముల బంగారు ఆభరణాలు, ఒక జాగ్వార్, ఒక ఆడి, ఒక టాటా నెక్సాన్ కారుతో పాటు నాలుగు ద్విచక్ర వాహనాలు, సుమారు రూ.5 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ పరికరాలు కూడా గుర్తించినట్లు ACB తెలిపింది.
గుర్తించిన స్థిర, చర ఆస్తుల డాక్యుమెంట్ విలువ సుమారు రూ.6.13 కోట్లుగా ఉన్నట్లు ACB పేర్కొంది. వీటి మార్కెట్ విలువ పత్రాల్లో చూపిన విలువ కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపింది.
అదనంగా వివాదంలో ఉన్న ఓ ఫ్లాట్ కొనుగోలు కోసం రూ.1.30 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు, వివిధ వ్యక్తులకు రూ.1.33 కోట్లు అప్పుగా ఇచ్చినట్లు కూడా ACB గుర్తించినట్లు తెలిపింది.
మరిన్ని ఆస్తులపై ప్రస్తుతం వెరిఫికేషన్ కొనసాగుతోందని, కేసు దర్యాప్తులో ఉందని ACB వెల్లడించింది. ఈ కేసు అవినీతి నిరోధక చట్టంలోని సంబంధిత నిబంధనల కింద నమోదు చేసినట్లు తెలిపింది.
లంచం డిమాండ్‌పై ఫిర్యాదు: ప్రభుత్వ ఉద్యోగి లంచం అడిగితే ACB టోల్‌ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయవచ్చని అధికారులు తెలిపారు. WhatsApp ద్వారా 9440446106కు కూడా సమాచారం ఇవ్వవచ్చని పేర్కొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
