బండ్లగూడ RTO కార్యాలయంలో ACB తనిఖీలు.. రూ.24,760 నగదు గుర్తింపు
అనధికార వ్యక్తులు, ఏజెంట్ల హాజరుపై ACB ఆరా.. 33 రవాణా దరఖాస్తులు మిస్సింగ్

హైదరాబాద్, సెప్టెంబర్ 22: హైదరాబాద్ బండ్లగూడలోని RTO సౌత్ జోన్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో పలు ఉల్లంఘనలు, అనుమానాస్పద అంశాలు గుర్తించినట్లు ACB వెల్లడించింది.
ACB రంగారెడ్డి రేంజ్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో కొంతమంది సిబ్బంది సెల్ఫోన్లలో అనుమానాస్పద UPI లావాదేవీలు గుర్తించినట్లు తెలిపారు. అలాగే కార్యాలయంలో దరఖాస్తులతో తిరుగుతున్న అనధికార వ్యక్తులు, ఏజెంట్లు ఉన్నట్లు గుర్తించారు.
ఏ సి బి అధికారులు తెలిపిన వివరాలు ప్రకారం..కొంతమంది అధికారులు ఏజెంట్ల ద్వారా దరఖాస్తులు త్వరగా ముందుకు వెళ్లేలా వాటిపై ప్రత్యేక సంకేతాలు, పేర్లు నమోదు చేస్తున్నట్లు తనిఖీల్లో గుర్తించినట్లు ACB పేర్కొంది. ఈ వ్యవహారంలో B. సునీత, మహ్మద్ ఇమ్రాన్, K. బాబూజీ, N. హేమంత్ కుమార్, K. సాయికుమార్, MA లతీఫ్ ఖాన్, T. సాయికాంత్ తదితర అధికారుల పేర్లను ACB తన నివేదికలో ప్రస్తావించింది.
కార్యాలయంలో ఉన్న ఏజెంట్ల వద్ద రూ.24,760 నగదు ఉన్నట్లు గుర్తించారు. అలాగే సీనియర్ అసిస్టెంట్ K. సాయికుమార్, జూనియర్ అసిస్టెంట్ T. సాయికాంత్కు సంబంధించిన 33 రవాణా దరఖాస్తులు కనిపించలేదని ACB తెలిపింది.
ఇక కొంతమంది సిబ్బంది చాలా కాలంగా అదే కార్యాలయంలో పనిచేస్తున్నట్లు తనిఖీల్లో గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ముఖ్యంగా MA లతీఫ్ ఖాన్ దాదాపు 20 ఏళ్లుగా స్వల్ప విరామాలతో RTO సౌత్ జోన్ కార్యాలయంలో పనిచేస్తున్నట్లు ACB పేర్కొంది.
తనిఖీల్లో గుర్తించిన అంశాలపై ACB అధికారులు తదుపరి చర్యలు, పరిశీలన కొనసాగించనున్నట్లు తెలిపారు.
లంచం డిమాండ్ చేస్తే 1064కు ఫిర్యాదు: ప్రభుత్వ ఉద్యోగి లంచం అడిగితే ACB టోల్‌ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయవచ్చని అధికారులు తెలిపారు. WhatsApp ద్వారా 9440446106కు కూడా సమాచారం ఇవ్వవచ్చని పేర్కొన్నారు. ఫిర్యాదుదారుడి పేరు, వివరాలను గోప్యంగా ఉంచుతామని ACB తెలిపింది.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
