డిండి ప్రాజెక్టు రద్దు చేయాలి: పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీ
పాలమూరు ప్రయోజనాలకు నష్టం చేసిన గత ప్రభుత్వ నేతలు సమాధానం చెప్పాలి: టి.జి. శ్రీనివాస్

షాద్‌నగర్, సెప్టెంబర్ 22(Zindagi9news): డిండి ప్రాజెక్టును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 27వ తేదీ నుంచి రైతులు చేపట్టనున్న పాదయాత్రకు పాలమూరు నాయకులు మద్దతు ఇవ్వాలని ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీ షాద్‌నగర్ కన్వీనర్ టి.జి. శ్రీనివాస్ పిలుపునిచ్చారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నుంచి డిండి ప్రాజెక్టు పేరుతో నల్గొండ ప్రాంతానికి సాగునీటిని తరలించే ప్రయత్నాలను వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మాణం కోసం సంవత్సరాల పాటు చర్యలు చేపట్టినప్పటికీ, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఎన్ని ఎకరాలకు, ఏ ప్రాంతాల్లో సాగునీరు అందించారో మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి స్పష్టంగా సమాధానం చెప్పాలని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఎన్ని కిలోమీటర్ల మేర డిస్ట్రిబ్యూటరీ కాలువలు నిర్మించారో కూడా వెల్లడించాలని కోరారు.
కృష్ణా జలాల వినియోగంలో పాలమూరు ప్రాంతానికి జరిగిన నష్టంపై కూడా రాజకీయ పార్టీలు సమాధానం చెప్పాలని ఆయన అన్నారు. గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం డిండి ప్రాజెక్టుకు పరిపాలనా అనుమతులు ఇచ్చి పనులు ప్రారంభించిందని ఆరోపించారు. పాలమూరు రైతాంగానికి దక్కాల్సిన సాగునీటిని ఇతర ప్రాంతాలకు తరలించకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత అప్పటి ప్రభుత్వంపై ఉందన్నారు.
పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నుంచి డిండి ప్రాజెక్టు పేరుతో ఒక్క చుక్క నీరు కూడా తరలించకుండా పోరాడాలని శ్రీనివాస్ కోరారు. ఈ అంశంపై పాలమూరు ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు రైతుల పాదయాత్రలో పాల్గొని తమ వైఖరిని స్పష్టం చేయాలని బహిరంగంగా పిలుపునిచ్చారు.
“డిండి ప్రాజెక్టు రద్దు చేయాలి. పాలమూరు రైతాంగ ప్రయోజనాలను కాపాడాలి” అనే డిమాండ్‌తో ఈనెల 27 నుంచి చేపట్టనున్న పాదయాత్రలో రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని జేఏసీ కోరింది.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
