ఇంటి అనుమతి కోసం రూ.13 వేల లంచం.. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

మంచిర్యాల, ఆగస్టు 21 (జిందగీ9న్యూస్): ఇంటి నిర్మాణానికి అనుమతి ఇవ్వడంతో పాటు కొత్తగా నిర్మించిన ఇంటికి ఇంటి నంబర్ కేటాయించేందుకు రూ.13 వేల లంచం తీసుకున్న పంచాయతీ కార్యదర్శిని ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం లింగయ్యపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి జె. వరలక్ష్మి ఫిర్యాదుదారుడి నుంచి తొలుత రూ.20 వేలు డిమాండ్ చేశారు. అనంతరం చర్చల తర్వాత రూ.13 వేలకు అంగీకరించారు.లంచం మొత్తాన్ని నగదుగా కాకుండా మరో పంచాయతీ కార్యదర్శి లావణ్యకు చెందిన PhonePe ఖాతాకు బదిలీ చేయాలని వరలక్ష్మి సూచించారు. దీంతో ఫిర్యాదుదారుడు రూ.13 వేలను ఆ ఖాతాకు బదిలీ చేయగా, లంచం డిమాండ్, చెల్లింపునకు సంబంధించిన ఆధారాలను ఏసీబీ అధికారులు సేకరించారు. అనంతరం వరలక్ష్మిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి, కరీంనగర్‌లోని ప్రత్యేక ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. కేసు దర్యాప్తులో ఉన్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.
