డంపింగ్ యార్డ్‌తో కరీంనగర్ ప్రజల ఆరోగ్యానికి ముప్పు
డంపింగ్ యార్డ్‌ను వెంటనే తరలించాలి: తెలంగాణ రక్షణ సేన

కరీంనగర్, ఆగస్టు 18 (Zindagi9news): కరీంనగర్ బైపాస్ రోడ్డులోని డంపింగ్ యార్డ్‌ను నగరానికి దూరంగా తరలించి, శాస్త్రీయ పద్ధతుల్లో వ్యర్థాల నిర్వహణ చేపట్టాలని తెలంగాణ రక్షణ సేన జిల్లా బాధ్యుడు గుంజపడుగు హరిప్రసాద్ డిమాండ్ చేశారు. డంపింగ్ యార్డ్ సమస్యను పరిష్కరించాలంటూ తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో మంగళవారం అక్కడ ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా హరిప్రసాద్ మాట్లాడుతూ.. ఏళ్లుగా పేరుకుపోయిన చెత్తతో దుర్వాసన, పొగ, దుమ్ము వంటి సమస్యలు తలెత్తుతున్నాయని ఆరోపించారు. కోతిరాంపూర్, లక్ష్మీనగర్, కట్ట రాంపూర్, కొత్తయాస్వాడ, కమాన్, బస్టాండ్, అంబేద్కర్ స్టేడియం పరిసర ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
డంపింగ్ యార్డ్‌ను తరలిస్తామని గతంలో హామీలు ఇచ్చినా సమస్య పరిష్కారం కాలేదని విమర్శించారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా డంపింగ్ యార్డ్‌ను స్మార్ట్ డంప్‌యార్డ్‌గా మారుస్తామని చెప్పిన హామీలు అమలు కాలేదన్నారు.
యుద్ధప్రాతిపదికన డంపింగ్ యార్డ్‌ను తరలించి, బయోమైనింగ్ ద్వారా ఇప్పటికే పేరుకుపోయిన చెత్తను తొలగించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో చెత్త పేరుకుపోకుండా వార్డు స్థాయిలోనే తడి, పొడి వ్యర్థాలను వేరు చేసి శాస్త్రీయంగా ప్రాసెసింగ్ చేసే శాశ్వత వ్యవస్థ ఏర్పాటు చేయాలని కోరారు.
కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన నాయకులు, మహిళా విభాగం ప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
