హైదరాబాద్‌లో 18,766 ఆటోలకు గుడ్‌న్యూస్.. ఎలక్ట్రిక్‌గా మారితే రూ.1.50 లక్షల వరకు సబ్సిడీ
తెలంగాణ ఆటో రిక్షా ఎలక్ట్రిక్ మార్పిడి పథకం–2026కు కేబినెట్ ఆమోదం.. రూ.200 కోట్ల బడ్జెట్

హైదరాబాద్, ఆగస్టు 16 (Zindagi9News): హైదరాబాద్‌ను కాలుష్యరహిత, పర్యావరణహిత ప్రజా రవాణా నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఆటో రిక్షా ఎలక్ట్రిక్ మార్పిడి పథకం–2026ను అమలు చేయాలని నిర్ణయించింది. ఈ పథకం ద్వారా CURE (Core Urban Region Economy) పరిధిలోని పెట్రోల్, డీజిల్ ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు లేదా కొత్త ఎలక్ట్రిక్ ఆటోలు కొనుగోలు చేసేందుకు రూ.1.50 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించనున్నారు.
రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించిన వివరాల ప్రకారం.. CURE ప్రాంతంలో ప్రస్తుతం 18,766 అర్హత కలిగిన ICE ఆటో రిక్షాలు ఉన్నాయి. వీటిలో 11,254 డీజిల్ ఆటోలు, 7,512 పెట్రోల్ ఆటోలు ఉన్నాయి.
రెండు విధానాల్లో ప్రయోజనం
ప్రస్తుత ఆటోను కొనసాగించాలనుకునే యజమానులు AIS-123 ఆమోదం పొందిన ఎలక్ట్రిక్ రెట్రోఫిట్ కిట్ ద్వారా తమ వాహనాన్ని ఎలక్ట్రిక్‌గా మార్చుకోవచ్చు. కిట్, ఇన్స్టాలేషన్, అవసరమైన ఫిట్మెంట్ ఖర్చుల కోసం రూ.1.50 లక్షల వరకు లేదా వాస్తవ వ్యయం.. ఈ రెండింటిలో తక్కువ మొత్తాన్ని ప్రభుత్వం ఆర్థిక సహాయంగా అందించనుంది.
అలాగే పాత పెట్రోల్ లేదా డీజిల్ ఆటోను అప్పగించి కొత్త ఎలక్ట్రిక్ ఆటో కొనుగోలు చేసుకునే వారికి రూ.1.50 లక్షల స్థిర సబ్సిడీ అందించనున్నారు. ఎంపానెల్ చేసిన డీలర్ల ద్వారా సబ్సిడీ మొత్తాన్ని ముందుగానే తగ్గించి వాహనం అందించే విధంగా పథకాన్ని అమలు చేయనున్నారు.
రూ.200 కోట్ల బడ్జెట్
ఈ పథకం అమలుకు ప్రభుత్వం రూ.200 కోట్ల బడ్జెట్‌ను ప్రతిపాదించింది. సామాజిక వర్గంతో సంబంధం లేకుండా CURE ప్రాంతంలోని అర్హత కలిగిన ఆటో యజమానులకు పథకం వర్తించనుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల నుంచి రూ.50 కోట్ల చొప్పున మొత్తం రూ.200 కోట్లను సమకూర్చే విధంగా ప్రతిపాదన రూపొందించారు.
కాలుష్యానికి చెక్.. డ్రైవర్లకు ఊరట
పెట్రోల్, డీజిల్ ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చడం ద్వారా హైదరాబాద్‌లో వాయు, శబ్ద కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు ఆటో డ్రైవర్లపై పెరుగుతున్న ఇంధన వ్యయ భారాన్ని తగ్గించడమే పథకం ప్రధాన ఉద్దేశమని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
తెలంగాణ రైజింగ్ విజన్–2047కు అనుగుణంగా పర్యావరణ పరిరక్షణ, సుస్థిర పట్టణ అభివృద్ధి, ఆటో డ్రైవర్ల ఆర్థిక ప్రయోజనాలను సమన్వయం చేస్తూ ఈ పథకాన్ని రూపొందిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్‌ను స్వచ్ఛమైన గాలి, సుస్థిర ప్రజా రవాణా దిశగా తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
