జమ్మికుంటలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరి అరెస్ట్
230 గ్రాముల గంజాయి, 2 సెల్ఫోన్లు స్వాధీనం

జమ్మికుంట, ఆగస్టు 16(Zindagi9news):
సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న ఇద్దరు యువకులను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ రామకృష్ణ కేసు వివరాలను వెల్లడించారు.
మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణం కల్యాణి ఖనికి చెందిన నాగిరెడ్డి హరిప్రసాద్ (26, హైదరాబాద్‌లోని ఓయో రూమ్స్ రిసెప్షనిస్ట్), మందమర్రి మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన దుర్గం కార్తీక్ (19, ప్రస్తుతం హైదరాబాద్ నివాసి) గంజాయి సేవించే అలవాటుకు బానిసలయ్యారు. ఈ క్రమంలో ఈ నెల 15న మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు వెళ్లి, ఓ గుర్తుతెలియని వ్యక్తి వద్ద రూ.11,400 చెల్లించి 230 గ్రాముల గంజాయిని కొనుగోలు చేశారు.
రైలు మార్గంలో మందమర్రికి తీసుకువచ్చి దాచిపెట్టిన గంజాయిని, ఆదివారం జమ్మికుంట పట్టణంలోని ఎఫ్‌సీఐ (FCI) గోడౌన్ పరిసర ప్రాంతంలో విక్రయించేందుకు యత్నించారు. పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించగా, సిబ్బంది వారిని చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.11,400 విలువైన 230 గ్రాముల గంజాయి, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
యువత భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు: సీఐ
యువత గంజాయి వంటి మత్తుపదార్థాలకు బానిసై జీవితాలను నాశనం చేసుకోవద్దని సీఐ రామకృష్ణ హితవు పలికారు. గంజాయి రవాణా, విక్రయం లేదా వినియోగంపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలపాలని కోరారు. మాదకద్రవ్యాల విక్రేతలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
