విమల్ పాన్ మసాలా ప్రకటనపై ముగ్గురు ప్రముఖులకు షోకాజ్ నోటీసులు

ముంబై, ఆగస్టు 16 (Zindagi9News): విమల్ బ్రాండ్‌కు సంబంధించిన పాన్ మసాలా/ఏలకుల ప్రకటనలో పాల్గొన్న ముగ్గురు బ్రాండ్ ఎండార్సర్లకు మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్, 2006 నిబంధనలను ఉల్లంఘిస్తూ ప్రకటనకు ప్రచార మద్దతు ఇచ్చారన్న అంశంపై ఈ నోటీసులు జారీ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
మహారాష్ట్రలో పాన్ మసాలా తయారీ, నిల్వ, రవాణా, పంపిణీ, విక్రయాలపై నిషేధం ఉన్న నేపథ్యంలో.. అదే బ్రాండ్‌కు సంబంధించిన ‘VIMAL Elaichi’ ప్రకటనపై FDA అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ప్రకటన ఆన్లైన్, ఇతర మీడియా వేదికల్లో ప్రచారం అవుతున్నట్లు నోటీసులో పేర్కొన్నారు.
15 రోజుల్లో వివరణ ఇవ్వాలి: నోటీసులు అందుకున్న తేదీ నుంచి 15 రోజుల్లోగా తమ వాదనకు సంబంధించిన లిఖితపూర్వక వివరణతో పాటు ఆధారాలను సమర్పించాలని FDA ఆదేశించింది. వ్యక్తిగతంగా లేదా అధీకృత ప్రతినిధి ద్వారా వివరణ ఇవ్వవచ్చని తెలిపింది.
తమకు వ్యక్తిగతంగా విచారణ కావాలనుకుంటే ఆ విషయాన్ని లిఖితపూర్వక వివరణలో పేర్కొనాలని సూచించింది. నిర్ణీత గడువులో వివరణ అందకపోయినా, సమర్పించిన వివరణ సంతృప్తికరంగా లేకపోయినా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్, 2006 మరియు సంబంధిత నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని FDA హెచ్చరించింది.
ఈ వ్యవహారంపై సమాచారం కోసం నోటీసు ప్రతులను ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI), సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA), మహారాష్ట్ర ఫుడ్ సేఫ్టీ కమిషనర్ కార్యాలయాలకు కూడా పంపినట్లు పత్రంలో పేర్కొన్నారు.
